నోరెందుకు నొక్కారు? మహిళను బూటుకాలితో తంతారా?: పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం…

ap-high-court-in-amaravathi
- Advertisement -

అమరావతి: రాజధాని తరలింపును నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తోన్న మహిళలపై పోలీసుల చర్యలను, 144 సెక్షన్ విధింపు అమలు సందర్భంగా పోలీసుల ప్రవర్తనపై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అమరావతిలో పోలీసులు అంత భారీ స్థాయిలో కవాతు ఎందుకు నిర్వహించారంటూ ప్రశ్నించింది.

మహిళల ఆందోళన సందర్భంగా మగ పోలీసులు ప్రవర్తించిన విధానంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. రాజధాని అమరావతి గ్రామాల్లో సెక్షన్‌ 144 విధింపు, పోలీస్‌ యాక్టు 30 అమలుపై అమరావతి రైతులు, మహిళలు, న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది.

చదవండి: బీజేపీ-జనసేన పొత్తుపై.. చంద్రబాబు మౌనం వెనుక వ్యూహమేమిటో!?

ఈ అంశంపై రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ దాదాపు గంటసేపు తన వాదనలు వినిపించారు. 2014 నుంచి అమరావతిలో 144 సెక్షన్‌ ఉందని, దానిని ప్రభుత్వం పొడిగించిందని ఆయన కోర్టుకు తెలియజేశారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశంతోనే రైతులను పోలీసులు అడ్డుకున్నట్టు అడ్వకేట్‌ జనరల్‌ వివరించారు.

అయితే 144 సెక్షన్‌ అమలు తీరుపై హైకోర్టు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా 610 మందిపై కేసులు పెట్టడంపై కూడా న్యాయమూర్తులు అడ్వకేట్‌ జనరల్‌ వివరణ అడిగారు. బెంజ్‌ సర్కిల్‌ వద్ద ర్యాలీకి వెళ్తున్నందునే పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పగా ఆ సమాధానంపై న్యాయమూర్తులు సంతృప్తి చెందలేదు.

సుమోటోగా ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన ఫోటోలు… 

ఈ కేసులో పోలీసుల తీరుపై వచ్చిన ఫిర్యాదులు.. పత్రికల్లో వచ్చిన ఫొటోలను సుమోటాగా విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు పోలీసుల ప్రవర్తన సరిగా లేదంటూ మండిపడ్డారు. రాజధానిలో పోలీసులు భారీ స్థాయిలో కవాతు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

చదవండి: ఉరే సరి! ‘నిర్భయ’ కేసులో రాష్ట్రపతి కీలక నిర్ణయం, దోషి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ…

మందడంలో మహిళను పోలీసులు బూటుకాలితో ఎందుకు తన్నారు? ఆందోళనలో పాల్గొన్న మహిళ నోరెందుకు నొక్కారు? అసలు మహిళలను మగ పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ అడ్వకేట్ జనరల్‌ను నిలదీశారు. ‌

దీనికి ఏజీ బదులిస్తూ.. సమగ్రంగా ప్రమాణపత్రం దాఖలు చేస్తామని, అందుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో ఈ కేసులో విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. 

- Advertisement -