హానర్ బంపర్ ఆఫర్.. ఆ మొబైల్ తీసుకొస్తే రూ.4 లక్షలు ప్రైజ్ మనీ!

4:35 pm, Thu, 25 April 19
honor

జర్మనీ: ప్రస్తుతం ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్లకు బాగా అలవాటు పడిపోయింది. ఒక సర్వే ప్రకారం.. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేవారు.. తమ పక్కన ఉన్నవారితో కంటే స్మార్ట్ ఫోన్‌తోనే ఎక్కువగా గడుపుతున్నారు. జనం పల్స్ పసిగట్టిన కంపెనీలు రోజుకో కొత్త మోడల్ మార్కెట్లోకి దింపుతూ తమ అమ్మకాల పరిధిని పెంచుకుంటూ పోతున్నాయి.

సాధారణంగా మనం మన మొబైల్ ఫోన్ పోతే ఎంతో ఇబ్బంది పడిపోతాం. మన ఫోన్‌లో నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు.. ఇలా ప్రతి ఒక్కటి మొబైల్‌తోనే ముడిపడి ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్, ఫోన్ తయారీ కంపెనీ హానర్‌కు వచ్చింది.

తమ ఉద్యోగి ఒకరు ఫోన్‌ను పోగొట్టుకున్నారనీ, అది తీసుకొచ్చి ఇచ్చిన వారికి రూ.4 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తామని సంస్థ ప్రకటించింది. అదేంటి ఒక్క ఫోన్ పొతే.. కంపెనీ మరో ఫోన్ తయారు చేసుకోవచ్చు కదా?  ఆ మాత్రానికే ఆ ఫోన్ తెచ్చిచ్చిన వారికి రూ.4 లక్షలు ఇవ్వడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా?

ఎందుకంటే అది ప్రోటోటైప్ ఫోన్. త్వరలోనే ఆ మోడల్ ఫోన్‌ను హానర్ రిలీజ్ చేయబోతోంది. అందుకే కంపెనీ ఈ ప్రకటన చేసింది. దీంతో ఆ ఫోన్ కూడా అత్యంత ప్రధాన్యతను సంతరించుకుంది. త్వరలో రిలీజ్ చేయాల్సి ఉన్న ఫోన్ ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఓ పెద్ద కంపెనీ సైతం ఇబ్బంది పడుతోంది.

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఒకరు డస్సెడ్రాఫ్‌ నుంచి జర్మనీలోని మ్యూనిచ్‌కు ఐసిఇ 1125 రైలులో ఏప్రిల్‌ 22న ప్రయాణిస్తున్న సందర్భంలో ఆ ప్రొటో టైప్ ఫోన్ పోయిందని హానర్ తెలిపింది. ఈ ఫోన్ బూడిద రంగులో ఉందనీ,
అలాగే దీనికి కవర్ కూడా ఉందని తెలిపింది. ఈ మేరకు కంపెనీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందించింది.

కాగా, మే 21లోపే ఫోన్‌ని తీసుకురావాలనీ, ఆ తర్వాత తెచ్చి ఇచ్చినప్పటికీ తాము తీసుకోమని హానర్ కండిషన్ కూడా పెట్టింది. మే 21న లండన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో హానర్ 20 సిరీస్‌లో పలు మోడల్ ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఇటీవల చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో హానర్‌ 20, హానర్‌ 20 ప్రో, హానర్‌ 20ఏ, హానర్‌ 20సీ, హానర్‌ 20 ఎక్స్‌లను విడుదల చేసింది.