చిన్న దేశం.. వైద్య సౌకర్యాలూ అంతంతమాత్రం.. కానీ ‘కరోనా’పై గెలుపు సాధించింది!

4:33 pm, Sat, 28 March 20
vietnam-flag

హోచిమిన్ సిటీ: కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఇరాన్.. విలవిలలాడుతుంటే, ఓ చిన్న దేశం.. అందులోనూ వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండే దేశం.. ఈ వైరస్‌పై గొప్ప విజయం సాధించింది. 

విచిత్రం ఏమిటంటే.. ఈ దేశం చైనాకు పక్కనే ఉంటుంది. అయినా ఇప్పటి వరకు అక్కడ కరోనా వైరస్ కారణంగా ఎవరూ మరణించలేదు. అంతేకాదు, ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికీ వందల్లోనే ఉంది. ఇంతకీ ఆ దేశం ఏది? అక్కడి ప్రభుత్వానికి ఇదెలా సాధ్యమైంది?

చదవండి: డేంజర్ బెల్స్: ‘కరోనా’లోనూ అగ్ర స్థానమే… అమెరికాలో లక్ష దాటిన పాజిటివ్ కేసులు!

ఆ దేశం పేరు.. వియత్నాం. ముందుగా మేల్కొనడం, రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అవసరమైన చర్యలు తీసుకోవడమే వియత్నాంను ఇప్పుడు కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలబెట్టింది. 

ముందుగానే ‘లాక్‌డౌన్’.. అదే రక్షించింది!

చైనాలోని వూహాన్ నగరంలో 2019 చివరి రోజుల్లో కరోనా వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్‌ను గుర్తించి, దానిపై చైనా పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకమునుపే పక్కనే ఉన్న వియత్నాం రాబోయే ప్రమాదాన్ని పసిగట్టేసింది. 

అసలే తమ దేశంలో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రమేనని గుర్తించిన వియత్నాంలోని అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలు ఒకవేళ కరోనా వైరస్ గనుక తమ దేశంలో వ్యాపిస్తే దాన్ని ఎదుర్కోవడం కష్టమని అంచనాకు వచ్చారు. 

వెంటనే చైనాతో తమ దేశానికి ఉన్న సరిహద్దును వియత్నా ప్రభుత్వం దాదాపుగా  మూసివేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా చైనాలో జనవరి 20 తరువాత లాక్‌డౌన్ కార్యక్రమం మొదలుపెట్టగా.. అంతకంటే ముందే జనవరి 1 నుంచే వియత్నాం తమ దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ లాక్‌డౌన్ ప్రకటించింది. 

vietnam-capital-Hanoi-covid19
వెతికారు.. పట్టుకున్నారు.. తరలించారు…

వియత్నాం రాజధాని నగరం హోచిమిన్ సిటీ. ఈ నగర జనాభా కూడా 8 మిలియన్లు మాత్రమే. ఇక్కడ ఐసీయూ పడకల సంఖ్య కూడా వేయి లోపే ఉంటుంది. ఎందుకంటే వియత్నాంలో వైద్య సిబ్బంది, ఆరోగ్య రంగానికి నిధులు చాలా తక్కువగా ఉంటాయి. 

ఇక్కడ ‌లాక్‌డౌన్ విధించిన వెంటనే తొలుత కరోనా బారిన పడిన వారిని గుర్తించడం మొదలెట్టారు. ఇదొక ఉద్యమంలా సాగింది. ఈ విషయంలో అధికార కమ్యూనిస్టు పార్టీ సభ్యుల పాత్ర మరువలేనిది. వీరు స్వయంగా రంగంలోకి దిగి వ్యాధిగ్రస్థులను కనుగొనడంలో ప్రభుత్వానికి ఎంతగానో సహకరించారు. 

లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత మూడు, నాలుగు వారాల వ్యవధిలోనే వ్యాధిగ్రస్థులు ఎవరు, వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు, అనే విషయాలను తెలుసుకుని మొత్తంమీద అందరినీ గుర్తించి గృహ నిర్బంధంలో ఉంచారు.

అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడంతో క్రమంగా ఇక్కడ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఆ తరువాత ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో వియత్నాం ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. అయితే ఆ తరువాత కూడా నిరంతరం నిఘాను కొనసాగించారు.  

లాక్‌డౌన్ సమయంలో…

లాక్‌‌డౌన్ సమయంలో.. ప్రజలు ఇళ్లలో ఉంటే దేశానికి సేవ చేసినట్లే అని వియత్నాం ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ముక్కుకు పెట్టుకునే మాస్క్‌లు, చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లను ప్రజలకు సరఫరా చేసింది. 

మరోవైపు నాలుగు వారాల లాక్‌డౌన్.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో అక్కడి ప్రభుత్వం అనేక ఉద్దీపన పథకాలు కూడా ప్రకటించింది. 

ఇలా చైనాకు వేల మైళ్ల దూరంలో ఉన్న ఇతర దేశాలు కరోనా వైరస్ వ్యాప్తితో వణికిపోతుంటే.. పక్కనే ఉన్న వియత్నాం ఈ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొని తన ప్రజల ప్రాణాలను కాపాడుకుంది. 

ఈ వైరస్ కారణంగా ఆ దేశంలో ఒక్కరు కూడా చనిపోలేదంటే.. పాజిటివ్ కేసుల నమోదు కూడా కేవలం వందల్లోనే ఉందంటే.. వియత్నాం ప్రభుత్వం కృషి ఏ స్థాయిలో ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు!

A woman receives a free protective facemask from Buddhist volunteers in Hanoi on February 6, 2020