పబ్ జీ గేమ్ ఆడొద్దని చెప్పిన భర్త.. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన భార్య!

11:38 am, Wed, 1 May 19
Pub ji Game Latest News, divorce Latest News, Court News, Newsxpressonline

యూఏఈ: సాధారణంగా భర్త తనను పట్టించుకోవడం లేదనో, వేధిస్తున్నాడనో విడాకులు కోరిన మహిళలను ఇప్పటివరకూ చూసి ఉంటాం. కానీ తాజాగా భర్త ‘పబ్ జీ’ గేమ్ ఆడవద్దని చెప్పినందుకు ఓ యువతి కోర్టు మెట్లు ఎక్కింది.

తన హక్కులను హరిస్తున్న భర్త నుంచి విడాకులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని డిమాండ్ చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

పెళ్లైన దగ్గరి నుంచి ఫోన్‌లో…

యూఏఈలోని ఓ యువతి(20)కి ఇటీవల వివాహమయింది. అయితే పెళ్లైన దగ్గరి నుంచి ఆమె ఫోన్‌లో పబ్ జీ గేమ్‌ని విపరీతంగా ఆడటాన్ని గమనించిన భర్త.. ఆ అలవాటు మానుకోవాలని సూచించాడు. దీంతో ఒక్కసారిగా సదరు యువతి అగ్గిమీద గుగ్గిలమయింది.

‘నాకు విడాకులు కావాల్సిందే’ అని కోపంతో బుసలుకొట్టింది. ఈ విషయమై పోలీసులు ఏమయిందని ప్రశ్నించగా, తనకు కావాల్సిన వినోదాన్ని ఎంచుకునే హక్కును తన భర్త కాలరాస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.  పబ్ జీ గేమ్‌ను తాను కేవలం స్నేహితులు, బంధువులతోనే ఆడతానని స్పష్టం చేసింది.

అయితే ఆమెను బాధ పెట్టే ఉద్దేశం తనకు లేదనీ, కేవలం పబ్ జీకి బానిస కాకూడదన్న ఉద్దేశంతోనే దానికి దూరంగా ఉండాలని కోరానని భర్త వాపోయాడు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు త్వరలోనే విచారణ జరిపి తీర్పును వెలువరించనుంది.