శ్రీలంక బాంబు పేలుళ్లు: నిఘా హెచ్చరికలే అందలేదు.. నేనేం చేయగలను: ప్రధాని విక్రమసింఘే

4:58 pm, Sat, 27 April 19
Sri Lanka News, Sri Lanka Bomb Blasts News, Wickremesinghe News, Newsxpressonline

కొలంబో: శ్రీలంకలో గత ఈస్టర్ సండే రోజున చర్చిలు, స్టార్ హోటల్స్ వద్ద ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు మరణించిన సంగతి తెలిసిందే. ఇది నిఘా వర్గాల వైఫల్యమేనంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఇందుకు బాధ్యత వహిస్తూ శ్రీలంక పోలీస్ చీఫ్‌తోపాటు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అత్యున్నత అధికారి కూడా రాజీనామా చేశారు.

బాంబు పేలుళ్లపై ఆ దేశ ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే కూడా ఇది నిఘా వర్గాల వైఫల్యమేనని అంగీకరించారు. దేశంలో పొంచి వున్న ప్రమాదం గురించిన నిఘా వర్గాలు తనకు ఎలాంటి ముందస్తు సమాచారం అందించలేదని చెప్పారు. బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాని కూడా బాధ్యత వహించి రాజీనామా చేయాలనే విమర్శలపై ఆయన ఈ విధంగా స్పందించారు.

నా తప్పేముంది?: విక్రమసింఘే

‘‘నాకు నిఘా వర్గాలు గనుక ముందస్తు సమాచారం అందించి ఉంటే.. అయినా సరే నేనేమీ చర్యలు తీసుకోకపోయి ఉంటే.. అప్పుడు తప్పు నాది అయి ఉండేది.. ఒకవేళ అలా జరిగి ఉంటే.. నేను రాజీనామాకు ఏమాత్రం వెనుకడే వాడిని కాదు.. కానీ దురదృష్టవశాత్తు నాకు ఎలాంటి సమాచారం లేదు..’’ అని ప్రధాని విక్రమసింఘే వాపోయారు.

మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన విలేకరులతో మాట్లాడుతూ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న దాదాపు 130 మంది అనుమానితులు తమ దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు నిఘా సంస్థ భావిస్తోందని, పరారీలో ఉన్న మరో 70 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారని పేర్కొన్నారు.

ఆ ఇద్దరి నడుమ సయోధ్య కలేనా?

ఇదంతా చూస్తోంటే.. ప్రధాని విక్రమసింఘేకు సమాచారం లేకపోయినా.. అధ్యక్షుడు సిరిసేన వద్ద ఎంతో కొంత నిఘా వర్గాల సమాచారం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ కోణంలో ఆలోచిస్తే.. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన పదవుల్లో ఉన్న ఈ ఇద్దరు నేతల నడుమ అంతర్గత పోరు ఇంకా సద్దుమణిగినట్లు లేదనే అనిపిస్తోంది.

ఎందుకంటే, గత ఏడాది అక్టోబర్‌లో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేల నడుమ సంబంధాలు క్షీణించాయి. అదీ ఎంతగా అంటే.. ప్రధాని విక్రమసింఘేను ఆ పదవి నుంచి అధ్యక్షుడు సిరిసేన తొలగించేంతగా. అయితే డిసెంబర్‌లో శ్రీలంక ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. న్యాయస్థానం ఆదేశాలతో విక్రమసింఘే తిరిగి ప్రధానిగా నియమితులయ్యారు. అయినా వీరిద్దరి మధ్య సయోధ్య ఉన్నట్లు కనిపించడం లేదు. తాజా పరిణామాలు కూడా దీనినే నిర్ధారిస్తున్నాయి.

ఆత్మాహుతి బాంబర్ల ఆశ్రయం గుర్తింపు…

మరోవైపు విచక్షణా రహితంగా బాంబు పేలుళ్లకు పాల్పడి శ్రీలంకను చిగురుటాకులా వణికించిన ఆత్మాహుతి బాంబర్లు ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారన్నది శ్రీలంక భద్రతా బలగాలకు తెలిసిపోయింది. దీంతో వారు సోదాలు మొదలుపెట్టారు. శ్రీలంక తూర్పున ఉన్న సామ్మాన్‌తురై నగరంలో ఓ ఇంటిలో ఆత్మాహుతి బాంబర్లు తలదాచుకున్నట్లుగా భద్రతా బలగాలు చెబుతున్నాయి.

ఆ ఇంట్లో ఇస్లామిక్ స్టేట్ బ్యానర్, ఆత్మాహుతి బాంబర్లకు సంబంధించిన ఐఎస్ యూనిఫాం, 150 డైనమైట్ స్టిక్‌లు, లక్ష బాల్ బేరింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రాంతాలో సోదాలు జరుపుతుండగా అనుమానితులు కొందరు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో శ్రీలంక భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి.

చదవండి:  శ్రీలంకలో మళ్లీ బాంబు పేలుళ్లు.. ఆరుగురు చిన్నారులు సహా 15 మంది మృతి