ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికాకు షాక్!

12:10 pm, Wed, 8 January 20

టెహ్రాన్: అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. మంగళవారం రాత్రి ఇరాక్‌లోని అల్ అసద్, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై జరిపిన క్షిపణి దాడుల్లో 80 మందికిపైగా అమెరికా తీవ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. ఇరాన్ దాడిని పెంటగాన్ కూడా ధ్రువీకరించింది. అయితే, ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదని పేర్కొనగా, ఇరాన్ మాత్రం 80 మంది హతమయ్యారని పేర్కొంది. మరోవైపు అల్ అసద్ స్థావరంపై తొమ్మిది క్షిపణులతో ఇరాన్ దాడిచేసినట్టు స్థానిక భద్రతా వర్గాలు కూడా వెల్లడించాయి.

ఈ దాడులు తమ పనేనని ఇరాన్ తన అధికారిక మీడియాలో ప్రకటించింది. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడిచేశామని, తమ దాడులను ఏవీ అడ్డుకోలేకపోయాయని పేర్కొంది. మొత్తం 15 క్షిపణులతో దాడిచేసినట్టు తెలిపింది. అమెరికా కనుక మరోసారి దుస్సాహసానికి పాల్పడితే ఆ దేశానికి చెందిన 100 స్థావరాలను బూడిద చేస్తామని హెచ్చరించింది.

ఇరాన్ క్షిపణి దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో స్పందించారు. క్షిపణి దాడులను ఖండించిన ట్రంప్‌.. పశ్చిమాసియాకు మరిన్ని బలగాలను తరలించాలని ఆదేశించారు. ఇరాన్‌ మెరుపు దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో అమెరికా సైన్యం పశ్చిమాసియాను విడిచివెళ్లాలని ఇరాన్ హెచ్చరించింది.