కశ్మీర్‌ను కాపాడుకునేందుకు ఎందాకైనా వెళ్తాం: భారత్‌ను మరోమారు హెచ్చరించిన పాక్

6:20 am, Thu, 5 September 19

ఇస్లామాబాద్: కశ్మీర్ తమ మెడ నరం (జాగ్యులర్ వెయిన్) లాంటిదని, దానిని కాపాడుకునేందుకు ఎందాకైనా వెళ్తామని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి అసిఫ్ గఫూర్ హెచ్చరికలు జారీ చేశారు.

పాక్ ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గఫూర్ మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు.

‘‘కశ్మీర్ మా మెడ నరం. దానిని రక్షించుకునేందుకు ఎందాకైనా వెళ్తాం’’ అని హెచ్చరించారు. భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ పేరును గఫూర్ ప్రస్తావిస్తూ భారత్ పరోక్షంగా పాక్‌పై దాడిని కొనసాగిస్తోందని ఆరోపించారు.

‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని మోదీ రద్దు చేసి అనైతిక చర్యకు పాల్పడ్డారు. ఇది ఇకపై భావజాల వివాదం కాదు’’ అని గపూర్ పేర్కొన్నట్టు స్థానిక వెబ్‌సైట్లు పేర్కొన్నాయి.

యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే కాకుండా దేశభక్తితోనూ జరుగుతాయని అన్నారు. భారత దాడులకు పాక్ ప్రతిస్పందన ఆర్థిక వ్యవస్థ, దౌత్యం, ఆర్థిక, మేధస్సు చుట్టూ తిరుగుతోందన్నారు.

పాక్‌ను బలహీన పరిచే చర్యలు తీసుకోవాలని భారత్ భావిస్తుండవచ్చని, అయితే, యుద్ధాలు ఆయుధాలు, ఆర్థిక వ్యవస్థతోనే కాకుండా దేశభక్తితోనూ జరుగుతాయని భారత్‌కు చెప్పాలనుకుంటున్నామని గఫూర్ పునరుద్ఘాటించారు.