ప్రపంచంతో కన్నీరు పెట్టిస్తున్న శునకం.. యజమాని కోసం మూడు నెలలుగా..

10:14 pm, Tue, 26 May 20

 బీజింగ్: తన యజమానిని కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకున్న విషయం తెలియక ఆ శునకం మూడు నెలలుగా ఆసుపత్రిలో నిరీక్షించింది.

ఉన్నచోటు నుంచి కదలకుండా కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూసింది. కానీ, అతడు ఇక ఎప్పటికీ తిరిగి రాడని దానికి తెలియదు.

విషయం తెలిసిన జనం హృదయాలు మాత్రం కరిగి కన్నీరవుతున్నాయి. చైనాలోని వుహాన్‌లో జరిగిందీ ఘటన.

వుహాన్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో ఆసుపత్రికి వెళ్లాడు. వెళ్తూవెళ్తూ తన పెంపుడు శునకం గ్జియావో బేవోను కూడా తీసుకెళ్లాడు.

ఆసుపత్రిలో చేరిన అతడు పరిస్థితి విషమించడంతో ఐదు రోజుల్లోనే తుదిశ్వాస విడిచాడు. కానీ, తన యజమాని చనిపోయిన విషయం తెలియని ఆ శునకం మాత్రం అతడి కోసం ఆసుపత్రిలో ఎదురుచూస్తూనే ఉంది.

నిద్రాహారాలు మాని తన యజమాని కోసం ఉన్న చోటు నుంచి కదలకుండా ఎదురుచూస్తున్న శునకాన్ని చూస్తున్న ఆసుపత్రి సిబ్బంది గుండెలు కరిగిపోయాయి. దీంతో దానిని తీసుకెళ్లి దూరంగా వేరే ప్రదేశంలో వదిలేసి వచ్చారు.

కానీ, అది మాత్రం మళ్లీ అక్కడి నుంచి ఆసుపత్రిని వెతుక్కుంటూ వచ్చి మళ్లీ అదే చోటులో నిరీక్షించడం మొదలుపెట్టింది.

యజమానిపై దానికున్న ప్రేమను అర్థం చేసుకున్న సిబ్బంది అప్పటి నుంచి దాని బాగోగులు చూడడం మొదలుపెట్టారు. ఇటీవల దానిని జంతు సంరక్షణ సంస్థకు అప్పగించారు. ఈ శునకం కథ వెలుగులోకి రావడంతో వైరల్ అయింది.