శ్రీలంకలో పండుగపూట మారణహోమం….ఇది ఎవరి పని?

6:59 am, Mon, 22 April 19
kolambo maranahomam

శ్రీలంక: శ్రీలంకలో ముష్కర మూకలు మారణ హోమం సృష్టించారు. ఈస్టర్‌ పండుగ రోజున ఉన్మాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు. చర్చీలు, హోటళ్లు ఇలా జనసమర్ధం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.

మృత్యువు ఏ క్షణంలో, ఏ రూపంలో విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితిలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఉదయం 8.25 గంటల నుంచి మధ్యాహ్నం 2.25 వరకు ఎనిమిది పేలుళ్లు సంభవించాయి.

పేలుళ్ల తీవ్రతకు ప్రార్ధనలు చేస్తున్న వారు చేస్తున్నట్టుగానే ఛిద్రమైపోయారు. పండుగ రోజున భక్తులతో కిటకిటలాడిన ప్రార్ధనాలయాలు సెకన్ల వ్యవధిలో శవాల దిబ్బలుగా మారిపోయాయి. హోటళ్లు మరుభూములుగా మిగిలాయి.

ఉన్మాదం సృష్టించిన ఈ మారణకాండలో మొత్తం 215 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 60 మందికిపైగా అభం శుభం తెలియని చిన్నారులు కాగా, 30 మంది విదేశీయులు ఉన్నారు. మరో 500మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. వరుస పేలుళ్లతో దేశమంతా ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ దారుణ సంఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దీన్ని భారత్‌తో పాటు అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి.

విదేశీ పర్యాటకులే లక్ష్యంగా….

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన కొలంబోలోని పలు హాస్పిటల్స్‌కు తరలించారు. శ్రీలంక కాల మానం ప్రకారం ఉదయం 8.45 గంటల సమయంలో మూడు చర్చిలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. విదేశీ పర్యాటకులు లక్ష్యంగా ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ రెస్టారెంట్స్‌ లలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

తొలుత ఆరు ప్రాంతాల్లో బాంబుదాడులు జరగ్గా, మధ్యాహ్నం తర్వాత మరో రెండు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదం నుంచి తమిళనటి రాధికా శరత్‌కుమార్‌ తృటిలో తప్పించుకు న్నారు. పేలుళ్లకు సంబంధం ఉందన్న అనుమానంతో ఏడుగుర్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

మొదటి బాంబుపేలుడు సెయింట్‌ ఆంథోనీ చర్చిలో జరగ్గా, రెండు బాంబు పేలుడు సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో జరిగింది. మూడో పేలుడు బట్టికలోవ ప్రాంతం లోని చర్చిలో జరిగింది. అనంతరం హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. బట్టికలోవ ప్రాంతంలో ఈస్టర్‌ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొ న్నారు.

ఇక్కడ జరిగే పేలుడులో మృతిచెందినవారిలో అత్య ధికులు చిన్నారులే ఉండటం అత్యంత విషాదకరం. వందలాది మంది గాయపడటంతో వారిలో ఎవరైనా తమవారు ఉన్నారా అనే అనుమానంతో ప్రజలు పెద్ద సంఖ్యలో హాస్పిటల్స్‌కు పరుగులు తీస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌, భారత ప్రధాని మోడీ , సచిన్‌ టెండుల్కర్‌, కమల్‌ హాసన్‌, అభిషేక్‌ బచ్చన్‌, విరాట్‌ కోహ్లి, అనుశ్క శర్మ .. దేశ విదేశాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీలంక బాంబు పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

విషాదం: కొలంబోలో బాంబు పేలుళ్లు.. 156 మంది మృతి! ఈస్టర్ రోజునే…
మైగాడ్.. కొద్ది నిమిషాల ముందే ఆ హోటల్ ఖాళీ చేశా: సినీనటి రాధిక!