ఇక మండే సూర్యుడే టార్గెట్: ‘నాసా’ ప్రతిష్టాత్మక ప్రయోగం.. ‘పార్కర్ సోలార్ ప్రోబ్’

- Advertisement -

parker-solar-probe

మన సౌర కుటుంబంలో సహజ నక్షత్రమైన సూర్యుడు నిజంగానే ఓ మిస్టరీల పుట్ట.  సూర్యుడి ఉపరితలం కంటే చుట్టూ ఉండే వాతావరణం విపరీతమైన వేడి కలిగి ఉంటుంది.  దీనినే శాస్త్రవేత్తలు ‘కరోనా’ అని పిలుస్తారు.  ఈ కరోనా ప్రాంతంలో ఎందుకింత వేడి వాతావరణం ఉంటుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

- Advertisement -

సూర్యుడి చుట్టూ ఉండే ‘కరోనా’ నుంచి వెలువడే శక్తిమంతమైన కణాలు కొన్నిసార్లు మన ఉపగ్రహ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌ను క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టారు.  దీని పేరు.. ‘పార్కర్‌ సోలార్ ప్రోబ్’.  సూర్యుడికి సంబంధించిన గుట్టుమట్లు ఎన్నో ఈ ప్రయోగంతో వెల్లడవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి…

భగభగ మండే సూర్యుడికి సంబంధించిన ఎన్నో రహస్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ రోబోటిక్ వ్యోమనౌకను అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఆదివారం ఉదయం ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి డెల్టా –4 హెవీ రాకెట్‌ ద్వారా పార్కర్ ప్రోబ్ వ్యోమనౌకను నింగిలోకి పంపింది.  నిజానికి ఈ ప్రయోగం శనివారం తెల్లవారుజామున 3.53 గంటలకు జరగాల్సి ఉంది. కానీ, నిన్న వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ ప్రయోగాన్ని ‘నాసా’ ఆదివారానికి వాయిదా వేసింది.

రూ.లక్ష కోట్ల ఖర్చుతో…

భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ను మోసుకుంటూ డెల్టా –4 హెవీ రాకెట్‌ నింగికెగసింది.  దాదాపు రూ.లక్ష కోట్ల ఖర్చుతో చేస్తున్న ఈ ప్రయోగం విషయంలో ‘నాసా’ శాస్త్రవేత్తలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే ఈ ‘పార్కర్‌ సోలార్ ప్రోబ్’ రోబోటిక్ వ్యోమనౌక నేరుగా సూర్యుడి వద్దకు వెళ్లదు. బుధ గ్రహం చుట్టూ కనీసం ఏడు చక్కర్లు కొట్టిన తర్వాత 2024 డిసెంబర్‌ 19 నాటికి తొలిసారి సూర్యుడికి అత్యంత సమీపంలోకి అంటే.. కేవలం 40 లక్షల కిలోమీటర్ల దూరంలోకి వెళుతుంది.  ‘నాసా’ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం ద్వారా సూర్యుడికి సంబంధించి దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు కొరుకుడు ఎన్నో విషయాలు అవగతమవుతాయి.

ఈ సందర్భంగా ‘నాసా’ ఉన్నతాధికారి థామస్ జుర్బెచన్ మాట్లాడుతూ.. 150 కోట్ల డాలర్ల‌తో  ప్రత్యేకంగా రూపొందించిన ‘పార్కర్‌ సోలార్ ప్రోబ్’ రోబోటిక్ వ్యోమనౌక తమకు ఎంతో ముఖ్యమైందని, వ్యూహాత్మకమైనదని, అందుకే ఈ ప్రయోగం  విషయంలో ఇంజనీర్లు చాలా జాగ్రత్త వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.

పేరు వెనుక కథ ఇదీ…

నాసా చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరు 2017 వరకూ ‘సోలార్‌ ప్రోబ్‌’ మాత్రమే. ఆ తర్వాత దీని పేరును ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’గా మార్చారు. 1958లో సౌర తుపానులను మొట్టమొదట అంచనా వేసిన శాస్త్రవేత్త యుజీన్‌ పార్కర్‌ కృషికి గుర్తింపుగా ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు. యుజీన్‌ పార్కర్‌ షికాగో యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేశారు. బతికుండగా ఓ శాస్త్రవేత్త పేరు అంతరిక్ష నౌకకు పెట్టడం ‘నాసా’ చరిత్రలోనే ఇది మొదటిసారి.

ఇందులో ఏమేం ఉంటాయంటే…

‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’ వ్యోమ నౌక చిన్న సైజు కారులా ఉంటుంది.  అంతరిక్షంలో దాదాపు ఆరేళ్ల పాటు ప్రయాణించి మరీ ఇది సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరుతుంది. ఇందులో సూర్యుడి నుంచి వెలువడే రేడియోధార్మిక కిరణాలను గుర్తించేందుకు ఓ ఫీల్డ్‌ యాంటెన్నా.. అక్కడి ధూళి కణాలను సేకరించేందుకు ప్రత్యేకమైన ఎస్‌పీసీ పరికరం ఉంటాయి. వీటితో పాటు ఇంధనం సమకూర్చేందుకు సోలార్‌ ప్యానెల్స్, సమాచారాన్ని భూమ్మీదకు పంపేందుకు రేడియో యాంటెన్నా, అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించేందుకు మ్యాగ్నెటో మీటర్‌ వంటి పరికరాలూ ఉన్నాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…

ఇవన్నీ ఒక ఎత్తు.. వ్యోమనౌక  ముందు భాగంలో ఉండే ఉష్ణ కవచం ఇంకో ఎత్తు. దాదాపు 8 అడుగుల వ్యాసం, నాలుగున్నర అంగుళాల మందంతో కార్బన్‌ మిశ్రమ లోహంతో ఈ ఉష్ణ కవచం తయారైంది. దాదాపు 1,371 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకోగలగడం దీని ప్రత్యేకత. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఉష్ణ కవచానికి ఇంకోవైపున ఉండే పరికరాలన్నీ దాదాపు గది ఉష్ణోగ్రతలోనే ఉంటాయి.

అంటే.. ఈ వ్యోమనౌక సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళినప్పటికీ ఆ ఉష్ణం ఈ కవచాన్ని దాటుకుని ఏమాత్రం లోపలికి రాదన్నమాట.  ఇక సూర్యుడి చుట్టూ మూడు చక్కర్లు కొట్టిన తర్వాత పార్కర్‌ సోలార్ ప్రోబ్ సూర్యుడి వ్యాసానికి 9 రెట్లు ఎక్కువ దూరంలో ఉంటుంది. ఆ సమయంలో దీని వేగం గంటకు 4.3 లక్షల మైళ్లుగా ఉంటుంది.

 

 

- Advertisement -