కరోనా తగ్గేందుకు ఏం చేయాలో తెలుసా? ఆ ఉపాయం మన ట్రంప్ చెప్పారు చూడండి…

- Advertisement -

వాషింగ్టన్: కరోనా వైరస్ ఉద్ధృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం తగ్గించాలని తమ దేశ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

గతంలోనూ ఎన్నో విషయాల్లో తొలుత నోరుజారి ఆ తరువాత ట్రంప్ నాలుక కరుచుకున్న సంగతి తెలిసిందే. శనివారం ఒక్లహామాలోని టల్సాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కూడా ఆయన ఇలాగే మాట్లాడారు.

- Advertisement -

‘‘కరోనా నిర్ధారణ పరీక్ష అనేది కత్తికి రెండువైపులా పదును లాంటిది. ఎంత ఎక్కువ పరీక్షలు చేస్తే అంత ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తాయి. అందుకే దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గించమని అధికారులకు చెప్పా..’’ అని వ్యాఖ్యానించారు.

ట్రంప్ నోటినుంచి ఈ మాటలు వెలువడగానే ఆయన మద్దతుదారులు ఎప్పటిలాగే కేరింతలు కొట్టగా.. చాలామంది విస్మయానికి గురయ్యారు. ఆయన సరదాగా అన్నారా? లేక నిజంగానే అధికారులకు అలాగే చెప్పారా అని అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇక అమెరికాలో కరోనా వైరస్ విషయానికొస్తే.. ఆదివారం మధ్యాహ్నం సమయానికి అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,95,615కు చేరగా.. ఇప్పటి వరకు 1,21,441 మంది మ‌ృతి చెందినట్లు తెలుస్తోంది. 

అమెరికాలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలంటూ తొలినాళ్లలో వైద్య నిపుణులకు ట్రంప్ సూచించారు. దీంతో అక్కడ కొన్ని రోజులపాటు భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించారు.

అయితే నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరింత ప్రజాభిమానం చూరగొనేందుకు ట్రంప్ యత్నిస్తున్నారు. దేశంలో కరోనా ప్రభావం కూడా తగ్గుముఖం పడితే అది ఆయన సాధించిన విజయమే అవుతుంది.

దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వీలైనంత త్వరగా పునరుద్ధరించే ప్రయత్నాలు కూడా ట్రంప్ ప్రభుత్వం చేస్తోంది. 

ఈ నేపథ్యంలో ప్రజల మెచ్చుకోలు కోసం కరోనా వైరస్ ఉద్ధృతిని తక్కువ చేసి చూపేందుకు యత్నిస్తున్నారని, ఇదే ట్రంప్ ప్లాన్ అంటూ ఆయన వ్యతిరేక వర్గీయులు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. 

- Advertisement -