అంగారకుడిపైకి నాసా ‘ఇన్‌సైట్’

- Advertisement -

కాలిఫోర్నియా: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ శనివారం ‘ఇన్‌సైట్‌’ అనే అంతరిక్ష నౌకను విజయవంతంగా అంగారక గ్రహంపైకి ప్రయోగించింది. అంగారకుడిపై దిగి ఆ గ్రహాంతర్భాగాలను అధ్యయనం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌ నుంచి భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4.35 గంటలకు అట్లాస్‌ వీ రాకెట్‌ సహాయంతో ‘ఇన్‌సైట్‌’ ల్యాండర్‌ అరుణ గ్రహం దిశగా దూసుకెళ్లింది.

అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి నాసా చేపట్టిన మొట్టమొదటి ఇంటర్‌ ప్లానెటరీ ప్రయోగమిది. ‘ఇన్‌సైట్‌’ పూర్తి పేరు ఇంటీరియర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ యూజింగ్‌ సీస్మిక్‌ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసి అండ్‌ హీట్‌ ట్రాన్స్‌పోర్ట్‌. ఈ ప్రాజెక్టు కోసం నాసా సుమారు రూ.6,635 కోట్లు(99.3 కోట్ల డాలర్లు) ఖర్చుచేసింది. అన్నీ సజావుగా సాగితే ఈ ఏడాది నవంబర్‌ 26 నాటికి అంగారక గ్రహం ఉపరితలంపై ఇన్‌సైట్‌ దిగుతుంది. సౌర విద్యుత్, బ్యాటరీతో పనిచేసే ల్యాండర్‌ 26 నెలలపాటు అరుణగ్రహంపై తన అధ్యయనం కొనసాగిస్తుంది.

- Advertisement -

భూకంపాల మాదిరిగానే అంగారకుడిపై ప్రకంపనలు, హిమపాతాలు, ఉల్కాపాతాలు చోటుచేసుకున్న విషయం తమకు తెలిసిందేనని.. అయితే ఇవి ఎలా జరుగుతాయన్న ముఖ్యమైన సమాచారాన్ని ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామని ‘నాసా’ ముఖ్య శాస్త్రవేత్త జిమ్‌ గ్రీన్‌ చెప్పారు. ప్రయోగంలో భాగంగా ఇన్‌సైట్‌ అక్కడి ఉష్ణోగ్రతలను పరిశీలించనుంది. గ్రహం మధ్యధరా రేఖ ప్రాంతంలో వేసవి కాలంలో పగటి పూట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌ కాగా.. రాత్రి మైనస్‌ 73 డిగ్రీలకు పడిపోతుంది.

అంతర్భాగంపై అధ్యయనం…

అంగారక గ్రహంపై అడుగుపెట్టిన తర్వాత ఆ గ్రహ ఉపరితలాన్ని 10 నుంచి 16 అడుగుల లోతుకు తవ్వి అంతర్భాగ పరిస్థితులపై ‘ఇన్‌సైట్’ ల్యాండర్ అధ్యయనం చేస్తుంది. అనంతరం దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని అందించడంతోపాటు కొన్ని కోట్ల ఏళ్ల కిందట భూమి లాంటి రాతి గ్రహాలు ఏవిధంగా ఏర్పడ్డాయన్నది తెలుపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

- Advertisement -