ఆ మూడు ప్రాంతాలు మావే.. భారత్ నుంచి తిరిగి తీసుకుంటాం: నేపాల్ ప్రధాని సంచలన ప్రకటన

1:47 am, Thu, 21 May 20
nepal-pm-kp-sharma-oli-speaks-about-kalapani-limpiyadhura-and-lipulekh

ఖాఠ్మండు: భారత్, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం నేపాల్ ప్రధాని సంచలన ప్రకటనతో మరో మలుపు తిరిగింది.

నిజానికి లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్‌ నుంచి తిరిగి తీసుకుంటామంటూ నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రకటించారు.

చదవండి: వామ్మో.. మాస్క్ ధరించకుంటే రూ.61 వేలు.. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా!

అంతేకాదు, ఆ మూడు ప్రాంతాలు నేపాల్‌ భూభాగంలోనే ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్‌ ఆమోదం కూడా తెలిపింది.

అనంతరం పార్లమెంట్‌లో ఆ దేశ ప్రధాని మాట్లాడుతూ.. నేపాల్‌కు చెందిన ఈ మూడు ప్రాంతాల్లో భారత్ సైన్యాన్ని మోహరించి వివాదాస్పదంగా మార్చిందంటూ ఆరోపించారు.

కాలాపానీలో 1962 నుంచి భారత సైన్యం ఉందని, నేపాలీలు అక్కడికి వెళ్లకుండా భారత్ అడ్డుకుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ‘‘గత పాలకులు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వెనుకంజ వేశారు.. కానీ మేం మాత్రం ఆ మూడు ప్రాంతాలను తిరిగి పొందుతాం..’’ అని పేర్కొన్నారు.

పైగా ఈ మూడు ప్రాంతాలను తమ దేశానికి అప్పగించాలని భారత్‌ను డిమాండ్‌ చేస్తూ ఆ దేశంలో అధికారంలో ఉన్న  కమ్యూనిస్ట్‌ పార్టీ పార్లమెంట్‌లో ప్రత్యేక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది.

గత ఏడాది అక్టోబర్ నుంచే వివాదం…

అసలు భారత్-నేపాల్ నడుమ వివాదం గత ఏడాది అక్టోబర్‌లోనే మొదలైంది. కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ అప్పట్లో మన దేశం ఒక మ్యాప్‌ విడుదల చేసింది.

అప్పట్నించి నేపాల్ మన దేశంపై గుర్రుగానే ఉంది. మరోవైపు భారత్‌తో వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ నేపాల్ మిత్రదేశం చైనా కూడా సలహా ఇచ్చింది. 

చదవండి: వీడెవడండీ బాబు!: విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లి.. 24 ఏళ్లుగా అక్కడే మకాం, చివరికి…

ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని ధర్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌ కనుమతో కలుపుతూ భారత్‌ రోడ్డు నిర్మించడంపై గత వారం నేపాల్‌లో భారత రాయబారికి ఆ దేశం నిరసన కూడా తెలిపింది.

తాజాగా లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు నేపాల్ భూభాగంలో ఉన్నట్లుగా చూపే కొత్త మ్యాప్‌ను నేపాల్ క్యాబినెట్ ఆమోదించడమేకాక, అసలు ఆ మూడు ప్రాంతాలు తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్‌ నుంచి తిరిగి తీసుకుంటామంటూ నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ పార్లమెంట్‌లో తాజాగా ప్రకటన చేయడం సంచలనంగా మారింది.