అసలే ‘కరోనా’ భయంతో ప్రపంచం వణికిపోతుంటే.. ఉత్తరకొరియా ఏం చేసిందో తెలుసా?

4:42 pm, Sat, 21 March 20
north-korea-launched-two-short-range-ballistic-missiles-off-its-east-coast

సియోల్: ఒకవైపు యావత్ ప్రపంచం ప్రాణాలు తీస్తోన్న కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ఆందోళన చెందుతుంటే.. ఉత్త‌ర‌ కొరియా మాత్రం చాపకింద నీరులా వ్యవహరిస్తోంది. శనివారం ఆ దేశం రెండు స్వల్పశ్రేణి మిస్సైళ్ల‌ను ప‌రీక్షించింది. ఈ విషయాన్ని ద‌క్షిణ కొరియా కూడా నిర్ధారించింది.  

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ ప్రావిన్సు నుంచి తూర్పు దిశ‌గా ఆ క్షిప‌ణులు దూసుకెళ్లినట్లు పేర్కొంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నుంచి తనకు చాలా అందమైన లేఖ అందింది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించడం గమనార్హం. 

చదవండి: చైనాలో సంచలనం.. కరోనా వైరస్ నుంచి బయటపడిన వందేళ్ల వృద్ధుడు

ఉత్తర కొరియా తూర్పు భాగంలోని హామంగ్ పట్టణానికి దగ్గరగా ఉండే హామ్‌గ్యాంగ్ ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారు. ఈ స్వల్పశ్రేణి క్షిపణులు మాక్ 6.1 వేగంతో 50 మీటర్ల ఎత్తులో 410 కిలోమీట‌ర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. కొన్ని రోజుల క్రితం కూడా ఫైరింగ్ డ్రిల్‌లో భాగంగా ఉత్తర కొరియా కొన్ని మిస్సైళ్ల‌ను పరీక్షించింది.

ఉత్తర కొరియా చర్యపై దక్షిణ కొరియా మాట్లాడుతూ.. ‘’ఓ వైపు ప్ర‌పంచం మొత్తం కరోనా వైరస్ వ్యాప్తితో బాధ‌ప‌డుతుంటే.. ఇదే సమయంలో ఉత్త‌ర‌ కొరియా ఇటువంటి క్షిపణి పరీక్షలు నిర్వహించడం శోచ‌నీయ‌ం’ అంటూ వ్యాఖ్యానించింది.

ఉత్తర కొరియా.. మళ్లీ ఎందుకిలా?

వచ్చే ఆగస్టు 11న అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. ఈ సైనిక విన్యాసాలపై ఇప్పటికే ఉత్తర కొరియా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. దీనిని రెచ్చగొట్టే చర్యగా ఆ దేశం అభివర్ణించింది.

మరోవైపు అమెరికాలో 2020 అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ‘మిస్సైల్ మ్యాన్’ కిమ్ జోంగ్ ఉన్‌ను తాను కట్టడి చేశానంటూ ప్రపంచానికి గొప్పగా చెప్పుకుంటూ వస్తోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు.. ఉత్తర కొరియా తాజాగా నిర్వహించిన క్షిపణి పరీక్షలు కొంత వరకు ఇబ్బంది కలిగించేవే. 

చదవండి: కరోనా అప్‌డేట్: దేశంలో 258కి పెరిగిన పాజిటివ్ కేసులు, ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే…

నిజానికి ఈ క్షిపణి పరీక్షల వెనుక ఉత్తర కొరియా ఉద్దేశం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పరువు తీయడమే. ఎందుకంటే, క్షిపణి పరీక్షలను నిలిపివేస్తామంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గతంలోనే ట్రంప్‌కు హామీ ఇచ్చారు. అయితే మాట ఇచ్చిన తరువాత కూడా ఆయన దానిని నిలుపుకోలేదు.

కిమ్ జోంగ్ ఉన్ వరుసగా క్షిపణి పరీక్షలు జరుపుతూనే వస్తున్నారు. తాజాగా జరిపిన మిస్సైల్ టెస్ట్.. ఇప్పటి వరకూ జరిపిన వరుస పరీక్షల్లో అయిదో పరీక్ష.

ట్రంప్‌ను బ్లాక్ మెయిల్ చేసే వ్యూహం…

ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆ దేశం పెద్ద మొత్తంలో డబ్బు గుంజే ప్లాన్ వేసిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షిపణి పరీక్షలు జరపకుండా కిమ్ జోంగ్ ఉన్‌‌ను నిలువరించడంలో అమెరికా అధ్యక్షుడు విఫలమయ్యాడనే పేరును ట్రంప్‌కు తీసుకురావడమే దాని ముఖ్య ఉద్దేశం.

దీంతో వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభ మసకబారుతుంది. ఆయనపై ఆ దేశ ప్రజల్లో విశ్వాసం కొంతైనా సన్నగిల్లుతుంది. ఒకవేళ అదేగనుక జరిగితే మళ్లీ అధ్యక్ష పీఠం అధిష్ఠించడంలో ట్రంప్‌కు ఇబ్బంది ఎదురుకావచ్చు.

చదవండి: షాకింగ్: నాకు మోడీ ఎంతో ఇమ్రాన్ అంతే: ఇండియా టూర్‌లో ట్రంప్ వ్యాఖ్యలు…

కనీసం అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకైనా ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు జరపకుండా కట్టడి చేయాల్సిన అవసరం ట్రంప్‌కు ఎంతైనా ఉంటుంది. దీనికోసం అవసరమైతే ఎన్నికలకు ముందే ట్రంప్.. కిమ్‌తో సమావేశం అయ్యే ప్రయత్నం చేస్తారు. ఉత్తర కొరియా గనుక దారికి వస్తే ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖాయం. 

ఒకవేళ అమెరికా అధ్యక్షుడితే సమావేశం గనుక జరిగితే..  ట్రంప్‌తో బేరం పెట్టే అవకాశం ఉత్తరకొరియా అధినేతకు దక్కుతుంది. ‘ఊరికే గమ్మున ఎలా ఉంటాం? అడిగినంత ఇస్తే తప్ప’.. అంటూ ట్రంప్‌ను లొంగదీయొచ్చు. ఇదే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అసలు ప్లాన్‌లా కనిపిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. 

ఇంతకీ ‘కిమ్’ రాసిన ఆ లేఖలో ఏముంది?

ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు జరపడానికి కొద్దిసేపటి ముందు అమెరికా అధినేత ట్రంప్ శ్వేతసౌధంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడే నాకు ఉత్తర కొరియా అధినేత కిమ్ నుంచి ఓ లేఖ అందింది. ఆ మూడు పేజీల ఉత్తరం నిజంగా చాలా అందంగా, సానుకూలంగా ఉంది. మా మధ్య మరోమారు సమావేశం జరగొచ్చు..’’ అని వ్యాఖ్యానించారు. 

చదవండి: ‘‘నాపై ఎన్నో కుట్రలు, సొంత పార్టీ వారే అలా.., చిరంజీవే లేకుంటే ఆత్మహత్య చేసుకునే వాడిని…’’

ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించిన కాసేపటికే కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి పరీక్షలు జరపడం ఏమిటి? ఇంతకీ కిమ్ జోంగ్ ఉన్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రాసిన ఆ లేఖలో ఏముంది? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. 

క్షిపణి పరీక్షలకు సొమ్ము ఎక్కడిదో తెలుసా?

ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షలకు, ఆయుధ అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు ఎలా సమకూర్చుకుంటోందో తెలుసా? సైబర్ దాడుల ద్వారా! అవును, ఇదే నిజం. ఇప్పటి వరకు ఉత్తరకొరియా ఇలా సైబర్ దాడులకు పాల్పడి 2 బిలియన్ డాలర్లు(దాదాపు 14 వేల కోట్లు) ఆర్జించినట్లు ఓ నివేదిక ఐరాస ఆంక్షల కమిటీకి అందింది.

చాలా కాలంగా ఆర్థిక సేవలు అందించే సంస్థలపైన, క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలను లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం.

అంతేకాకుండా శక్తివంతమైన కంప్యూటర్లను వినియోగిస్తూ సైబర్ మైనింగ్ ద్వారా ఉత్తర కొరియా నిపుణులు వర్చువల్ కరెన్సీని కూడా సృష్టిస్తున్నారని, ఆ రకంగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారని, అలా వచ్చిన మొత్తాన్ని ఆ దేశం క్షిపణి పరీక్షలకు ఉపయోగిస్తోందని చెబుతున్నారు. 

చదవండి: కరోనా భయం: ల్యాండింగ్‌కు ‘నో’.. వెనుదిరిగిన ఫ్లైట్, అందులో 90 మంది భారతీయులు!