భారత్‌ను ఎండగట్టే ప్రయత్నంలో బొక్కబోర్లా పడిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

11:14 am, Sat, 4 January 20
pak-prime-minister-imran-khan

ఇస్లామాబాద్: భారత్‌ తీరును తప్పుబట్టే ప్రయత్నంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు అడ్డంగా దొరికిపోయారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతున్న ఆందోళనలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుని అడ్డంగా దొరికిపోయారు. ప్రపంచం ముందు నవ్వులపాలయ్యారు.

చదవండి: షాకింగ్: నాకు మోడీ ఎంతో ఇమ్రాన్ అంతే: ఇండియా టూర్‌లో ట్రంప్ వ్యాఖ్యలు…

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ముస్లింలను ఉత్తరప్రదేశ్‌లో దారుణంగా హింసిస్తున్నారంటూ మూడు వీడియోలను ఇమ్రాన్ షేర్ చేశారు. సరిగ్గా ఇక్కడే ఆయన అభాసుపాలయ్యారు. ఆ వీడియోల్లో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నట్టు ఉంది.

నెటిజన్ల విమర్శలతో నాలుక్కరుచుకుని…

అయితే, అది భారత్‌లో మాత్రం కాదు. ఈ వీడియోలను చూసిన ఇమ్రాన్‌పై విమర్శల జడివానతో విరుచుకుపడ్డారు. దీంతో తప్పును గ్రహించిన ఇమ్రాన్ ఆ వీడియోలను తొలగించారు.

నిజానికి ఇమ్రాన్ పోస్టు చేసిన వీడియోలు భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంబంధించినవి కాదు. మే, 2013లో ఢాకాలో ఆందోళనకారులపై బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చేసిన లాఠీచార్జ్ దృశ్యాలవి. ప్రధాని స్థాయిలోని వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా ఆ వీడియోలను పోస్టు చేసి ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యారు.

చదవండి: చాలా కోపంగా ఉంది.. అయినా మీతోనే ఉన్నాం: మోడీకి కమల్ బహిరంగ లేఖ

ఇమ్రాన్ ఖాన్ ట్వీట్‌పై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ స్పందించారు. ‘నకిలీ వార్తలను ట్వీట్‌ చేయండి.. దొరికిపోండి.. ఆ ట్వీట్‌లను డిలీట్‌ చేయండి.. మళ్లీ రిపీట్‌ చేయండి’ అని రవీశ్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.