విమాన ప్రమాదానికి ముందు.. పైలట్-ఏటీసీ మధ్య జరిగిన చివరి సంభాషణ ఇదే!

7:52 pm, Sat, 23 May 20

కరాచీ: పాకిస్థాన్‌లో నిన్న జరిగిన విమాన దుర్ఘటనకు ముందు విమాన పైలట్, ఏటీసీకి మధ్య జరిగిన చిట్టచివరి సంభాషణకు సంబంధించిన ఆడియో వెలుగులోకి వచ్చింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘లైవ్‌ఏటీసీ.నెట్’లో ఈ సంభాషణ ప్రత్యక్షమైంది.

ఆ ఆడియో ప్రకారం.. పీకే 8303 విమాన పైలట్, ఏటీసీతో మాట్లాడుతూ.. ‘మేడే, మేడే, మేడే’ అని చెబుతూ తాము ప్రమాదంలో ఉన్నామన్న సంకేతాన్ని ఏటీసీకి పంపాడు.

రాడార్ నుంచి విమానంతో సంబంధాలు తెగిపోవడానికి కొన్ని క్షణాల ముందు ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడిందని పైలట్ ఏటీసీకి తెలిపాడు. దీంతో స్పందించిన ఏటీసీ రెండు రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది.

అయినప్పటికీ పైలట్ గో-రౌండ్ చేయాలని నిర్ణయించుకున్నాడని, ఇది చాలా బాధాకరమైన ఘటన అని అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్.ఖాన్ వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.

పైలట్-ఏటీసీ మధ్య చివరి సంభాషణ…

పైలట్: పీకే 8303 టు అప్రోచ్
ఏటీసీ: జీ సర్
పైలట్: మేం ఎడమవైపు తిరగాలా?
ఏటీసీ: కన్ఫామ్డ్
పైలట్: విమానం రెండు ఇంజిన్లు పాడయ్యాయి. మేం నేరుగా వెళ్తున్నాం
ఏటీసీ: మీరు బెల్లీ ల్యాండింగ్ చేస్తున్నట్టు కన్ఫామ్ చేయండి
పైలట్: అర్థం కావడం లేదు
ఏటీసీ: ల్యాండింగ్ కోసం 2, 5 రన్‌వే అందుబాటులో ఉంది
పైలట్: రోజర్
పైలట్: సర్, మేడే, మేడే, మేడే, పాకిస్థాన్ 8303
ఏటీసీ: పాకిస్థాన్ 8303, రోజర్ సర్ రెండు రన్‌వేలు అందుబాటులో ఉన్నాయి.

ఆ తర్వాత ఏటీసీ, పైలట్ మధ్య సంభాషణ కట్ అయింది. ఆ తర్వాత కొన్ని క్షణాలకే విమానం కరాచీలోని జనావాస ప్రాంతాల్లో కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో ఒకే ఒక్కరు మినహా దాదాపు అందరూ దుర్మరణం పాలై ఉంటారని చెబుతున్నారు.