33 వేల అడుగుల ఎత్తులో విమానం.. సడన్‌గా డోర్ తెరచిన ప్రయాణికుడు! ఆ తరువాత ఏమైందంటే…

5:19 pm, Sat, 27 April 19
London Latest News, Flight Latest News, Passenger News, Newsxpressonline

లండన్‌: ఓ విమానం ఆకాశంలో 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా ఓ ప్రయాణికుడు డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు.

లండన్‌లోని గట్వీక్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఈజీ జెట్ ఎయిర్‌బస్ A319 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటన తర్వాత విమానాన్ని ఇటలీలోని పిసా ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ విమానంలో ప్రయాణించిన వాణిజ్యవేత్త రిచార్డ్ కన్యార్డ్ ఈ ఘటన గురించి వివరించారు.  ఆయన కథనం ప్రకారం…

ఓ ప్రయాణికుడు గబగబా టాయిలె‌ట్‌లోకి వెళ్లాడు. అతడు చాలా ఆందోళనకరంగా కనిపించాడు. ఒక నిమిషం తర్వాత టాయిలెట్‌ నుంచి బయటకు వచ్చిన అతడు నేరుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వద్దకు వెళ్లి డోరు తెరవడానికి ప్రయత్నించాడు.

అప్పటికి విమానం గాల్లోనే ఉంది. దీంతో కొంతమంది ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన సిబ్బంది, ఇంకొందరు ప్రయాణికులు.. అతడిని ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవనివ్వకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత విమానం ల్యాండయ్యే వరకు అతడిని ఒక చోట కూర్చోబెట్టారు. తరువాత అతడిని విమానాశ్రయంలో భద్రతా సిబ్బందికి అప్పగించారు.

మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని సియానాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడి వయస్సు 30 ఏళ్లు ఉంటుంది. ఆ తరువాత ఈజీ జెట్ సంస్థ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది.

తమ విమానం ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ డోరు తెరిచేందుకు ప్రయత్నించాడని, విమానం దిగిన వెంటనే అతడిని అదుపులోకి తీసుకోవాలని విమాన కెప్టెన్ కోరాడని పేర్కొంది.

అయితే, విమానం గాలిలో ఉన్నప్పుడు తలుపులు తీయడం కష్టమని, క్యాబిన్ ప్రెజర్ వల్ల తలుపులు తెరుచుకోవని ఈజీ జెట్ పేర్కొంది. తమ సిబ్బంది వెంటనే స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని ఆ ప్రకటనలో తెలిపింది.

చదవండి:  ఎయిర్ ఇండియాలో సర్వర్ డౌన్! ప్రయాణికుల పడిగాపులు!