స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్.. అమ్మ కడుపులోనే కొట్టుకుంటున్న కవలలు!

2:16 pm, Wed, 17 April 19

చైనా: పిల్లలు పరస్పరం తగవు పడటం సర్వసాధారణమే. అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్లు.. అన్నాచెల్లెళ్లు.. ఇలా ఎవరైనా సరే , ఒక వయసు వచ్చే వరకు గొడవపడుతూనే ఉంటారు. కవలలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.

అయితే, ఇలా ఎవరైనా గొడవ పడేది.. పుట్టిన తర్వాత. మరి పుట్టకముందే, తల్లి కడుపులో ఉన్నప్పుడే తన్నుకుంటుంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూపినట్టుగా ఉంటుంది. ఔను.. మీరు చదివింది నిజమే! తల్లి కడుపులో ఉన్న కవలలు ఒకరిని ఒకరు కొట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఏడాది క్రితం తీసింది.

స్కానింగ్ కోసం వెళితే…

చైనాలోని యిన్ చౌన్‌ ప్రాంతంలో ఓ మహిళ నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను భర్త స్కానింగ్ కోసం ఓ స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. ఆ సమయంలో వైద్యులు ఆమె గర్భాశయాన్ని స్కానింగ్ చేస్తుండగా, అందులో ట్విన్స్ కనిపించారు.విచిత్రంగా ఆ ఇద్దరూ తన్నుకుంటున్నారు.

ఆ విషయాన్ని గమనించిన డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ఘటన తాము చూడలేదని. కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రమే ఇలా జరుగుతుందని వారు తెలిపారు.

సోషల్ మీడియలో బీభత్సంగా…

దీన్ని చూసి థ్రిల్ ఫీల్ అయిన ఆ కవలల తండ్రి ఆ స్కానింగ్ మొత్తాన్ని తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీయడమేకాక సదరు వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే అది ఇప్పుడు బీభత్సంగా వైరల్ అవుతోంది. ఏకంగా 20 లక్షల మంది దాన్ని షేర్ చేశారు. 25 లక్షల మందికి పైగా దాన్ని వీక్షించారు.

ఇది ఏడాది క్రితం వీడియో. ఇప్పుడు వారిద్దరూ ఈ ప్రపంచంలోకి వచ్చారు. ఇద్దరూ ఆడపిల్లలే. కాదు ఆడ పులులు అనాలేమో! వారికి ఆ తల్లిదండ్రులు చెర్రీ, స్ట్రాబెర్రీ అని పేర్లు పెట్టారు. వీరి ఫైటింగ్ వీడియోను చూసిన వారిలో కొందరు..  తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇలా కొట్టుకుంటే, ఇక పుట్టిన తర్వాత ఇంకెంత కొట్టుకుంటారో అని కామెంట్ చేస్తున్నారు.

అయితే మరికొందరేమో.. లేదు.. లేదు.. వాళ్లు ఒకరిని ఒకరు చాలా బాగా చూసుకుంటారని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా తల్లి గర్భంలో ఉండగా వారెలా కొట్టుకుంటున్నారో ఓ లుక్కేయండి.