రేసిస్ట్ అంటే ట్రంప్ ఖాతా కనపడుతుంది.. ట్విటర్‌లో!

5:41 pm, Sun, 7 June 20

వాషింగ్టన్: ట్విటర్‌లో ఎవరి ఖాతానైనా చూడాలంటే వారి పేరును సెర్చ్ చేస్తాం. లేదా వారికి సంబంధించిన ఏదైనా విషయాన్ని సెర్చ్ చేస్తాం. 

అలా సెర్చ్ చేస్తే వారి ఖాతా, లేదా ఆ విషయానికి సంబంధించిన ఖాతాలు కనపడతాయి. ఉదాహరణకు బాలీవుడ్ అని సెర్చ్ చేశామనుకోండి బాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, తదితరుల ఖాతాలు కనపడతాయి. 

అయితే ప్రస్తుతం ట్విటర్‌లో ఎవరైనా రేసిస్ట్ అని సెర్చ్ చేస్తే ట్రంప్ ఖాతా కనిపిస్తోందట. ఓ దేశాధ్యక్షుడి ఖాతాను ట్విటర్ ఇలా చూపించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఈ విషయాన్ని పలువురు ఖాతాదారులు గుర్తించి ట్విటర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై స్పందిచిన ట్విటర్ ప్రతినిధులు దీనికి తమ యూజర్లే కారణమని చెబుతున్నారు.

ఇటీవల చాలామంది ట్విట్టర్ యూజర్లు.. ట్రంప్‌ను ప్రస్తావించినప్పుడు ‘రేసిస్ట్’ పదం వాడుతున్నారట.

ఈ కారణంగానే రేసిస్ట్ అని సెర్చ్ చేస్తే ట్రంప్ ఖాతా కనబడుతోందని ట్విట్టర్ ప్రతినిధులు వివరించారు. ఇందులో తమ తప్పేం లేదని చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై చర్యలు తీసుకుని సరిచేసేందుకు ప్రయత్నిస్తామని వారు తెలియజేసినట్లు సమాచారం.

ఇటీవల అమెరికాలో జాతివిక్షపై భారీ స్థాయిలో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. అల్లర్లు సృష్టిస్తున్న వారిపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మండిపడుతున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ట్విటర్‌ కూడా ట్రంప్‌కు సంబంధించిన కొన్ని పోస్టులను తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ తొలగించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది.