వందేళ్ల తర్వాత ఎన్నికలకు సిద్ధమైన బ్రిటన్.. ఫలితాలపైనే ‘బ్రెగ్జిట్’ ఆధారం

10:37 am, Wed, 30 October 19

లండన్: దాదాపు శతాబ్దకాలం తర్వాత బ్రిటన్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. బ్రెగ్జిట్ ప్రతిష్ఠంభనను తొలగించే ఉద్దేశంతో డిసెంబర్‌ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని మంగళవారం బ్రిటన్ పార్లమెంట్(హౌస్ ఆఫ్ కామన్స్) ఆమోదించింది.

418 అనుకూల ఓట్లతో తీర్మానం ఆమోదం పొందింది. 20మంది ఎంపీలు వ్యతిరేకించారు. ఎన్నికల కోసం ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పార్లమెంటు నుంచి ఆమోదం పొందడంతో దాదాపు శతాబ్దం తర్వాత డిసెంబర్ లో మొదటిసారిగా ఎన్నికలు జరగనున్నాయి.

1923 తర్వాత బ్రిటన్‌లో ఎన్నికలు జరగనుండడం ఇదే తొలిసారి కానుంది. దీంతో కలిపి గత ఐదేళ్లలో బ్రిటన్‌లో ఇది ఐదో సార్వత్రిక ఎన్నిక కానుంది.

కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య..

బ్రిటన్‌‌లో సాధారణంగా చలికాలంలో ఎన్నికలు జరగవు. ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణం. డిసెంబరు నెలలో ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతాయి. చలికాలం బ్రిటన్‌లో పగటి సమయం తక్కువ. మధ్యాహ్నం నుంచే చీకట్లు కమ్ముకుంటాయి. అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం సవాలుగా మారుతుంది.

వేదికలన్నీ ఫుల్

దీనికితోడు క్రిస్మస్, పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో డిసెంబర్ 12న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చోటు దొరకడం కూడా కష్టం అవుతుంది. వేదికలన్నీ క్రిస్మస్, పెళ్లిళ్లు, పార్టీలకు ముందే బుక్ అయిపోతాయి.

అలాంటప్పుడు, పోలింగ్ కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రజలను అక్కడి వరకూ తరలించడం కష్టం. కాబట్టి ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది. అంతే కాదు, వణికించే చలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కూడా నేతలకు కష్టమే.

మాట నిలబెట్టుకోలేక పోయిన ప్రధాని

బ్రెగ్జిట్ విషయంలో తర్వాత ఏం జరుగబోతుందనేది డిసెంబర్ 12న జరిగే ఎన్నికలు, దాని ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. అక్టోబర్ 31నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేస్తానన్న ప్రధాని బోరిస్ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు. దీంతో జరగబోయే ఎన్నికల్లో ప్రతిపక్షం దీనిని అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది.

బోరిస్ మళ్లీ గెలిస్తే..

జరగబోయే ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ మెజారిటీ సాధించగలిగితే..ఆయన తన షరతులపై యూరోపియన్ యూనియన్‌ నుంచి విడిపోతారు. వేరే పార్టీ గెలిచినా, లేదంటే వేరే ఎవరైనా ప్రధానమంత్రి అయినా బ్రెగ్జిట్ అంశంపై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం సాధ్యం అవుతుంది. ‘నో డీల్ బ్రెగ్జిట్’ అంటే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ బయటికి వచ్చే అవకాశం కూడా ఉంది.

అయితే వచ్చే ఏడాది బ్రిటన్ ఎలాంటి ఒప్పందం లేకుండా యూరోపియన్ యూనియన్‌ నుంచి బయటికి వస్తే, దానివల్ల బ్రిటన్ ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రజలు, వ్యాపారులు, ఎంపీలు చెబుతున్నారు. బ్రెగ్జిట్ గడువును మూడోసారి యూరోపియన్ పొడిగించింది.

వచ్చే ఏడాది జనవరి 31 వరకూ బ్రెగ్జిట్ గడువును పొడిగించింది. జనవరి 31కి ముందు బ్రిటన్ పార్లమెంట్ ఏదైనా ఒప్పందాన్ని ఆమోదిస్తే బ్రిటన్ ఈయూ నుంచి విడిపోవచ్చని చెప్పింది. 2016లో బ్రిటన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 52 శాతం మంది బ్రెగ్జిట్‌ను సమర్థించారు. 48 శాతం మంది వ్యతిరేకించారు.