భారత ‘శక్తి’ ప్రయోగంపై అమెరికా ‘కోబ్రా బాల్’ నిఘా! బంగాళాఖాతంపై చక్కర్లు…

6:17 pm, Thu, 28 March 19
Shakthi missile News, India Latest News, Newsxpressonline

వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్ జరిపిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయం కావడంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. అంతేగాక, ఏ-శాట్‌ ప్రయోగ అనుపానులను గుర్తించేందుకు ఆ దేశం అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలెట్టింది.  ప్రారంభించినట్లు తెలుస్తోంది.

భారత్‌ బుధవారం యాంటీ శాటిలైట్‌ ప్రయోగం ‘ఏ-శాట్’ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ప్రపంచంలో అంతరిక్షంలో ఉపగ్రహాలను ధ్వంసం చేయగలిగే  సత్తా ఉన్న నాలుగో దేశంగా మన దేశం అవతరించింది.

చదవండి: భారత్ ‘మిషన్ శక్తి’.. సక్సెస్! అంతరిక్షంలో క్షిపణి ప్రయోగం.. ఉపగ్రహం ధ్వంసం!

ఈ నేపథ్యంలో..  దీనిపై ప్రపంచ దేశాలు పెద్దగా అభ్యంతారాలు వ్యక్తం చేయలేదుగానీ, అమెరికా మాత్రం అంతరిక్ష వ్యర్థాలు అంటూ కొంత ఆందోళన వెలిబుచ్చింది. ఇక భారత్‌ను నిందించేందుకు ఎప్పుడెప్పుడు అవకాశం లభిస్తుందా.. అని ఎదురుచూసే పాకిస్తాన్ అయితే, ఓ అడుగు ముందుకేసి అంతరిక్షంలో భద్రత లేకుండా పోతోందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

అంతే, అంతకు మించి.. భారత్ ప్రయోగంపై ప్రపంచ వ్యాప్తంగా ఇంకెక్కడా ఎలాంటి అభ్యంతరాలు వినిపించలేదు. ఇది భారత దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు. గతంలో చైనా ఈ పరీక్ష నిర్వహించినప్పుడు ప్రపంచ దేశాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. డ్రాగన్ కంట్రీ అంతరిక్షంలో కూడా సైనికీకరణ చేస్తోందనే విమర్శలను అప్పట్లో చైనా ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రయోగం విజయవంతమైన గంటల్లోనే..

అయితే, బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బంగాళాఖాతంలోకి అమెరికాకు చెందిన ఆర్‌సీ 135ఎస్‌ కోబ్రా బాల్‌ అని పిలిచే ఒక ప్రత్యేకమైన నిఘా విమానం వచ్చి వెళ్లింది. భారత్‌ ఏ-శాట్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కొన్ని గంటలకే ఇది బంగాళాఖాతం ప్రాంతంలోకి ప్రవేశించడం గమనార్హం.

సాధారణంగా ఏదైనా పేలుళ్లు, ప్రయోగాలు జరిగినప్పుడు లభించే బాలిస్టిక్‌ డేటాను ఈ ఆర్‌సీ135ఎస్‌ కోబ్రా బాల్‌ సేకరిస్తుంది.55 ఏళ్ల క్రితం అమెరికా వద్ద ఇలాంటివి మూడు విమానాలు ఉన్నాయి.  ఆ దేశం వీటిల్లో ఒకదానిని హిందూ మహాసముద్రంలోని డిగోగార్సియా సైనిక స్థావరంలో మోహరించింది.

చదవండి: బాలాకోట్ ఎఫెక్ట్: బరితెగించిన పాక్, ఉగ్రవాదులకు ఇక ఆర్మీ యూనీఫాం!

సాధారణంగా ఇరాన్‌, ఉత్తర కొరియాలు ఆయుధ పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ అమెరికా నిఘా విమానం ఆ పరిసరాల్లోకి వెళ్లి వివరాలను సేకరిస్తుంటుంది. ఇలా ఈ విమానం ద్వారా సేకరించిన సమాచారం మొత్తం నేరుగా అమెరికా ఎన్‌ఎస్‌ఏ, డిఫెన్స్‌ సెక్రటరీకి చేరతాయి. అయితే, తాజాగా బంగాళాఖాతంలోకి కోబ్రా బాల్ ప్రవేశించిన వ్యవహారంపై అమెరికా స్పందించలేదు.

క్షిపణి ప్రయోగంతో భారత్ వైపు ప్రపంచం దృష్టి…

అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాన్ని భారత్‌ కూల్చేసిన ప్రయోగానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం లభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. 2017 లెక్కల ప్రకారమే భూ కక్ష్యలో దాదాపు ఐదు లక్షలకుపైగా ఉపగ్రహాలు, రాకెట్‌ శకలాలు, ఇతర వ్యర్థాలు తిరుగుతున్నాయి.

వీటిల్లో 95 శాతం పనికిరాని చెత్తే. పైగా అవి నిదానంగా కూడా తిరగవు.. గంటకు 17,500 మైళ్ల వేగంతో అవి ప్రయాణిస్తుంటాయి. వీటిల్లో గ్రహశకలాలు కూడా ఉంటాయి.

చదవండి: పుల్వామా దాడి: ఆధారాలు ఇచ్చినా.. పాత పాటే పాడుతోన్న పాకిస్తాన్!

ఈ నేపథ్యంలో తొలి ప్రయత్నంలోనే.. భారత్‌కు చెందిన యాంటీ శాటిలైట్‌ కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. ప్రయోగంలో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా అది మరో దేశ ఉపగ్రహాన్ని తాకడమో.. లేదా మన దేశానికే చెందిన పని చేసే ఉపగ్రహాన్ని కూల్చడమో చేస్తుంది.

అంతటి సున్నితమైన ఈ ప్రయోగాన్ని భారత్‌ ఎంతో ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసిందని, మన శాస్త్రవేత్తలు అద్భుతం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలో ఇలాంటి శక్తికలిగిన దేశాల్లో నాలుగో దేశంగా భారత్ నిలిచింది.