ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ట్రావెల్ బ్యాన్‌లో మరో ఆరు దేశాలు

12:28 pm, Sat, 1 February 20

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద ట్రావెల్ బ్యాన్‌లో కొత్తగా మరో ఆరు దేశాలను చేర్చారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ అఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.

ఎరిట్రియా, కిర్గిజిస్థాన్, మయన్మార్, నైజీరియా దేశస్థులకు విదేశీ వీసాలు ఇవ్వడాన్ని నిషేధిస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం సూడాన్, టాంజానియా జాతీయులపై అదనపు ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది.

ఈ దేశాలు ‘సరైన గుర్తింపు నిర్వహణ’, లేదంటే ‘ప్రాథమిక జాతీయ భద్రత’ అవసరాలకు అనుగుణంగా విధానాలను నిర్వహించడంలో విఫలమవుతున్నట్టు వైట్ హౌస్ తెలిపింది.

కొత్త ఆంక్షలు పర్యాటకులకు, వ్యాపార ప్రయాణాలకు వర్తించవని స్పష్టం చేసింది. అమెరికాలో నివసించాలనుకునే వలసదారులకు జారీ చేసే వీసాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని వివరించింది.

కాగా, ట్రంప్ సర్కారు ఇప్పటికే లిబియా, ఇరాన్, సోమాలియా, సిరియా, యెమెన్, ఉత్తర కొరియా, వెనిజులా తదితర దేశాలకు వీసాల జారీని నిలిపివేసింది.