కొంప ముంచిన ‘వాట్సాప్’! అర్జెంటుగా అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే మటాషే!!

11:10 pm, Tue, 14 May 19
cyber-attack-on-whatsapp-by-nso-group

వాషింగ్టన్: మీరు వాట్సాప్ మెసేజింగ్ యాప్ ఉపయోగిస్తున్నారా? అయితే మీ కొంప మునిగినట్లే! వాట్సాప్‌లో ఉన్న ఓ పెద్ద లోపాన్ని హ్యాకర్లు పట్టేశారు. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ అప్లికేషన్ ఉన్న మొబైల్ ఫోన్లు, ఇతర డివైజ్‌ల‌ను కూడా వారు హ్యాక్ చేశారు.

వాట్సాప్ ద్వారా హ్యాకర్లు ఆయా డివైజ్‌లలో నిఘా సాఫ్ట్‌వేర్‌ను కూడా ఇన్‌స్టాల్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా వాట్సాప్ సంస్థే వెల్లడించింది. హ్యాకర్ల దాడికి బలవకుండా ఉండాలంటే.. వినియోగదారులు అర్జెంటుగా వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.

వాట్సాప్ అప్లికేషన్ లేని మొబైల్ ఫోన్ ఉండదంటే అందులో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. వాట్సాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ అలాంటిది. ప్రస్తుతం వాట్సాప్‌కు 150 కోట్ల వినియోగదారులు ఉన్నారు.

మన దేశంలోనూ ఈ మెసేజింగ్ యాప్‌ను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఇంతటి ఆదరణ ఉంది కాబట్టే.. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ సంస్థ కొనేసింది. ప్రస్తుతం ఈ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ యాజమాన్యంలోనే ఉంది.

ఎవరీ హ్యాకర్లు?

వాట్సాప్‌‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్లు, ఇతర డివైజ్‌లపై హ్యాకర్ల దాడి జరిగినట్లు స్వయంగా ఆ సంస్థే ఒప్పుకుంది. అంతేకాదు ఈ దాడికి అత్యాధునిక సైబర్ నిపుణులు స్కెచ్ గీసినట్లు పేర్కొంది.

అయితే ఫైనాన్షియల్ టైమ్స్ కథనం మరోలా ఉంది. ఇజ్రాయెల్ భద్రతా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ దాడికి సూత్రధారి అని ఫైనాన్షియల్ టైమ్స్ చెబుతోంది. చేసింది ఎవరైనా కావచ్చు.. కానీ దాడి జరిగిందనేది మాత్రం వాస్తవం.

ఎవరీ ఎన్ఎస్ఓ గ్రూప్?

ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీయే.. ఈ ఎన్ఎస్ఓ గ్రూప్. గతంలో దీనిని ‘సైబర్ వెపన్స్ డీలర్’గా పిలిచేవారు. ఎన్ఎస్ఓ ప్రధాన సాఫ్ట్‌వేర్ ‘పెగాసస్’. ఇది హ్యాక్ చేసిన డివైజ్ నుంచి అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా సేకరించగలదు. అంటే.. అది మొబైల్ ఫోన్ కావచ్చు.. లేదా ఇతరత్రా డివైజ్ కావచ్చు.

లక్ష్యంగా చేసుకున్న డివైజ్ మైక్రోఫోన్ నుంచి, కెమెరా నుంచి, అలాగే లొకేషన్ డేటా సమాచారం కూడా క్యాప్చర్ చేయగలదట. ఈ ఎన్ఎస్ఓ గ్రూప్.. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని తీవ్రమైన నేరాలు, ఉగ్రవాదంపై పోరాటం వంటి వాటికోసం మాత్రమే.. అదీ అధీకృత ప్రభుత్వ సంస్థలకు మాత్రమే అందజేస్తుందట.

ఎలా జరిగింది?

వాట్సాప్‌ ఎంతో భద్రత కలిగిన మెసేజింగ్ యాప్ అంటూ ఆ సంస్థ గప్పాలు కొట్టుకునేది. వాట్సాప్‌లో మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయని, కాబట్టి తమ అప్లికేషన్ ఎంతో సురక్షితమైనదని గొప్పలు చెప్పుకునేది. ఇప్పుడు హ్యాకర్ల దాడితో.. వాట్సాప్‌ డొల్లతనం బట్టబయలైంది.

ఒకవేళ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటే.. ఏ మెసేజ్ అయినా పంపిన వారికి, దాన్ని అందుకున్న వారికి మాత్రమే ఆ మెసేజ్ చదవగలిగే రూపంలో కనిపిస్తుంది. అయితే రహస్యంగా ఇన్‌స్టాల్ చేసిన నిఘా సాఫ్ట్‌వేర్ ద్వారా హ్యాకర్లు ఈ మెసేజ్‌లు చదవగలుగుతున్నారంటే.. అర్థమేంటి?

హ్యాకర్లు వాట్సాప్‌లోని వాయిస్ కాలింగ్ ఫంక్షన్‌ను తమ దాడికి ఉపయోగించుకున్నారు. ఇలా వచ్చిన కాల్‌ను సదరు మొబైల్ లేదా ఇతర డివైజ్ వినియోగదారు స్వీకరించకపోయినా.. ఆటోమేటిక్‌గా ఆ నిఘా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిపోతుందట. అంతేకాదు, ఆ తరువాత ఆ కాల్ వివరాలు కూడా డివైజ్ కాల్ లిస్ట్‌ నుంచి వాటంతట అవే మాయం అవుతాయట.

ఎప్పుడు గుర్తించారు?

అయితే హ్యాకర్లు కొన్ని వర్గాల వారినే లక్ష్యంగా చేసుకున్నారని, వారి మొబైల్ ఫోన్లు, ఇతర డివైజ్‌లలోనే ఈ రకమైన నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేశారని చెబుతున్నారు. హ్యాకర్ల దాడికి ప్రధానంగా.. పాత్రికేయులు, లాయర్లు, ఉద్యమకారులు, మానవ హక్కుల కార్యకర్తలు టార్గెట్ అయి ఉంటారని భావిస్తున్నారు.

నిజానికి వాట్సాప్‌ మెసేజింగ్ యాప్ ద్వారా మొబైల్ ఫోన్లు, ఇతర డివైజ్‌లపై హ్యాకర్ల దాడి జరిగినట్లు ఈ నెల మొదట్లోనే గుర్తించారట. అందుకే వాట్సాప్ సంస్థ (గత శుక్రవారం) తన లేటెస్ట్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

ఇప్పుడేం చేయాలి?

చేసేదేం లేదు.. మొబైల్ ఫోన్లు, ఇతర డివైజ్‌లలో వాట్సాప్ యాప్‌ను వినియోగిస్తున్న వారంతా అర్జెంటుగా గూగుల్ ప్లే స్టోర్‌, ఐఓఎస్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి ఆ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సిందే.. లేకపోతే ఇంతే సంగతులు!

అదనపు ముందుజాగ్రత్త చర్యగా తమ అప్లికేషన్‌ను అప్‌డేట్ చేసుకోవాలంటూ వాట్సాప్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.