కరోనా వైరస్: గడగడలాడుతోన్న ప్రపంచం.. ఒక్క చైనాలోనే 170 మంది మృతి

coronavirus-outbreak-in-china
- Advertisement -

కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితే చాలు యావత్ ప్రపంచం ఉలిక్కిపడుతోంది. చైనా అయితే గడగడలాడిపోతోంది. ఎందుకంటే, ఈ ప్రాణాంతక వైరస్ పుట్టిందే చైనాలో. చైనాలోని వూహాన్ ప్రాంతంలో పురుడుపోసుకున్న ఈ వైరస్ ఇప్పటికే అక్కడ 170 మంది ప్రాణాలు బలిగొంది. అక్కడితో ఆగకుండా ఇది 22 దేశాలకు విస్తరించింది. 

కరోనా వైరస్‌కు మందు లేదు, చికిత్స లేదు. ఈ వైరస్ సోకిందంటే ప్రాణం పోయినట్లే. అందుకే కరోనా వైరస్ పేరు వింటే చాలు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడ తమకు సోకుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. 

చైనాలో ఒక్కరోజే 50 మంది మరణించారంటే ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం నాటికి 130 మంది వరకు నమోదైన మృతుల సంఖ్య.. 24 గంటలు తిరిగే సరికి 170కి చేరుకుంది. చైనాలో ఇప్పటి వరకు  మరో 7,921 మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని వివిధ ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

వూహాన్‌లో పుట్టి ఇతర దేశాలకు విస్తరిస్తూ…

చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్ నిర్దాక్షిణ్యంగా మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. చైనాలో ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా తరువాత ప్రపంచంలోనే రెండో పవర్‌ఫుల్ దేశం చైనా.. అలాంటి దేశమే ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు కుదేలైంది. 

అసలు చైనాలో ఈ వైరస్ ఎలా ప్రబలిందో కూడా సరిగా చెప్పలేకపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వైరస్ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చైనాకు వెళ్లాలంటే విదేశీయులు వణికిపోతున్నారు. దీంతో వ్యాపార పరంగా, పర్యాటక పరంగా, వాణిజ్య పరంగా చైనాపై ప్రభావం తీవ్రంగా పడింది.

అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందిన చైనా పరిస్థితే ఇలా ఉంటే… ఇక భారత్ లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల పరిస్థితి ఏమిటి? ఒకవేళ ఈ వైరస్ మన దేశంలోకి ప్రవేశిస్తే.. ప్రజలు పిట్టల్లా రాలిపోవాల్సిందే కదా? కరోనా లాంటి ప్రాణాంతక వైరస్‌లను ఎదుర్కోవడమెలా? అన్నది భారత్‌కు మిలియన్ డాలర్ల ప్రశ్నే.

- Advertisement -