మనిషి పోయినా ఓటు పోలేదు.. స్మశానం నుండి నేరుగా పోలింగ్ బూత్‌కి….

2:29 pm, Mon, 6 May 19
Chhatarpur man goes to vote after father's last rites

హైదరాబాద్: కొద్ది సేపట్లో పరీక్ష పెట్టుకుని కొందరు, పసి బిడ్డల్ని ఎత్తుకుని ఇంకొందరు, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కొందరు.. ఓటు వెయ్యడానికి రావడం ఈమధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. కానీ, స్మశానం నుండి నేరుగా పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేయడం ఎక్కడైనా చూశామా..?

అయితే ఖచ్చితంగా ఇది చదవాల్సిందే..

నూతన వధూవరులు ఓటు వేస్తున్నారంటే అది సంతోష సమయంలో వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ హర్షిస్తారు.. ఆ జంటని అభినందిస్తారు.. కానీ తండ్రి పోయి పుట్టెడు దుఃఖంలో ఉండి సైతం ఓటు వెయ్యడానికి వచ్చిన యువకుడిని చూసి ఓదార్చాలో అభినందించాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు ఆ ఊరి జనం.

చదవండి: వింత పెళ్లి పత్రికలు! బెంగళూరులో ‘వాటర్‌మెలన్‌’తో ఇన్విటేషన్!

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్‌లో ఓ వ్యక్తి మరణించాడు. ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మరణంతో తల్లడిల్లిపోయిన అతని కొడుకు దేశ పౌరుడిగా తన హక్కుని మాత్రం కోల్పోలేదు. తండ్రి చితికి నిప్పంటించి, అంత్యక్రియలు పూర్తయ్యాక నేరుగా పోలింగ్ బూత్ కి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

కనీ.. తన గుండెలపై ఆడించి.. ఇంత కాలం ప్రేమగా పెంచిన తండ్రి మరణిస్తే ఏ కొడుకైనా ఎలా ఉంటాడు? అంతటి బాధలో ఉండి కూడా ఆచారాలని పక్కన పెట్టి నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసిన ఆ యువకుడిని చూసిన ప్రతి ఒక్కరూ అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

చదవండి: ఆయన మూడు అంటే.. వీళ్లు ఆరు, కాంగ్రెస్ సర్జికల్ దాడులు కాగితాలపైనే: మోడీ ఎద్దేవా…

మునుపెన్నడూ లేని విధంగా ప్రజల్లో ఓటు హక్కుపై వచ్చిన చైతన్యం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఒకప్పుడు ఓటు వెయ్యాలంటే బద్ధకం. ఎవరైనా ఏదైనా అంటే నా ఒక్క ఓటు వల్ల నాయకుడు మారతాడా? ప్రభుత్వం మారుతుందా? అని సమాధానం చెప్పేవారు. కానీ ఇప్పుడిప్పుడే ఓటు విలువ తెలుసుకుంటున్నారు.

పసి బిడ్డల తల్లుల నుండి, కాసేపట్లో పెళ్లి పీటలెక్కబోయే దంపతులు, నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులు, రేపో మాపో అన్నట్టు ఉన్న వృద్ధుల వరకూ అందరూ మండే ఎండని, కారే చెమటని సైతం లెక్క చెయ్యకుండా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి వారందరినీ చూసైనా మన ఒక్కరి ఓటు వల్ల ఏమైపోతుందిలే అని ఫీలయ్యే బద్ధకస్థులు ఇకనైనా బద్ధకం వీడి బాధ్యత తెలుసుకోవాలని – ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆశిద్దాం..

చదవండి: రష్యాలో ఘోర విమాన ప్రమాదం… 41 మంది దుర్మరణం