ఇండియా టుడే-పీఎస్‌ఈ పోల్ సర్వే: ప్రధానిగా మోడీ వైపే మొగ్గు! రాహుల్ ‘న్యాయ్’కూ అమిత ఆదరణ…

4:09 pm, Sun, 7 April 19
india-today-pse-poll-survey-says-next-pm-is-modi

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీకే ప్రజలు పట్టం కట్టే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆయన పట్ల జనాదరణ గత ఏడాది అక్టోబర్‌లో 46 శాతం ఉండగా, ఈ ఏడాది జనవరిలో అది 48 శాతానికి.. అలాగే ఏప్రిల్‌లో 53 శాతానికి పెరిగింది.

ఇండియా టుడే పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్వేకోసం యాక్సిస్‌-మై-ఇండియా నిర్వహించిన పోల్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, పలు వర్గాలకు చెందిన 1,75,544 మం‍ది ఓటర్లను ఫోన్‌ ద్వారా వారి అభిప్రయాలు తెలుసుకోవడం ద్వారా పోల్‌ నిర్వహించారు.

ఇక భావి ప్రధానిగా రాహుల్‌ గాంధీని కోరుకునేవారు గత ఏడాది సెప్టెంబర్‌లో 32 శాతంగా ఉండగా, ఇప్పుడు 35 శాతం ప్రజలు ఆయన ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ కొత్తగా ప్రకటించిన కనీస ఆదాయ పథకం(న్యాయ్)కు విపరీతమైన ఆదరణ లభించింది. ప్రకటించిన రెండు వారాల్లోనే దేశవ్యాప్తంగా 52 శాతం ఓటర్లకు ఇది చేరువైంది.

వైమానిక దాడుల ప్రభావం ఏమీ ఉండదు…

అంతేకాదు, ఇండియా టుడే పీఎస్‌ఈ సర్వే కోసం యాక్సిస్‌-మై-ఇండియా నిర్వహించిన ఈ పోల్‌ సర్వేలో ఇంకా పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌‌పై భారత్ చేపట్టిన వైమానిక దాడుల అంశం లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపదని సర్వేలో వెల్లడైంది.

ఇక ఓటు వేసే ముందు ఆయా రాజకీయ పార్టీల సామర్థ్యాన్ని తాము పరిగణనలోనికి తీసుకుంటామని 39 శాతం ఓటర్లు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రధాని అభ్యర్థి ఎవరనేది చూసి ఓటు వేస్తామని 16 శాతం ఓటర్లు అభిప్రాయపడగా, 13 శాతం ఓటర్లు పార్టీ సిద్ధంతాలను పరిగణనలోనికి తీసుకుని ఓటు వేస్తామని చెప్పారు.

ఇక అభ్యర్థుల ఆధారంగా ఓటు వేస్తామని 12 శాతం మంది ఓటర్లు తెలిపారు. విచిత్రం ఏమిటంటే… జాతీయవాదం, ఎన్నికల ప్రణాళికలు, హామీల ఆధారంగా ఏ పార్టీకి ఓటు వేయాలనేది నిర్ణయించుకుంటామని కేవలం 1 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడటం.

ఈ ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధానాంశమని 21 శాతం ఓటర్లు చెప్పగా, తాగునీరు అంశం ప్రధానమని 20 శాతం మంది ఓటర్లు, అలాగే మెరుగైన పారిశుధ్యం, ధరల పెరుగుదల లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని 9 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు.

52 శాతం ఓటర్లకు చేరువైన ‘న్యాయ్‌’…

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా ఇటీవల కనీస ఆదాయ హామీ పథకం(న్యాయ్) ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. నిరుపేద కుటుంబాలకు ఏటా రూ.72 వేల నగదు సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ పథకానికి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ అభించింది. ప్రకటించిన రెండు వారాల్లోనే ఇది 52 శాతం మంది ఓటర్లకు చేరువైంది.

అయితే రాహుల్ ప్రకటనపై దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒకవేళ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌ పార్టీ గనుక అధికారంలోకి వస్తే.. ఈ పథకాన్ని ఆ పార్టీ కచ్చితంగా అమలు చేస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు 32 శాతం ఓటర్లు చెప్పగా.. 51 మంది ఓటర్లు దీనిపై నోరుమెదపలేదు. ఇక 17 శాతం మంది ‘న్యాయ్‌’ అమలుపై ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ భారీగా ఆశలు పెట్టుకున్న ఈ పథకం కేవలం 28 శాతం ఓటర్లను మాత్రమే ప్రభావితం చేయగలదని, 53 శాతం ఓటర్లను ఇది ప్రభావితం చేయలేదని, 19 శాతం ఓటర్లు మాత్రం ఈ పథకంపై అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని యాక్సిస్‌-మై-ఇండియా నిర్వహించిన పోల్‌ సర్వేలో వెల్లడైంది.