చైనాతో రెండు యుద్ధాలు.. మన సైనికులు తగ్గలేదు, మనమూ తగ్గొద్దు: కేజ్రీవాల్

- Advertisement -

న్యూఢిల్లీ: జిత్తులమారి చైనాతో ప్రస్తుతం భారత్ రెండు యుద్ధాలు చేస్తోందని, ఒకటి సరిహద్దులో.. రెండోది ఆ దేశం నుంచి వ్యాపించిన కరోనా వైరస్‌తో అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉద్ధృతి మరింత పెరుగుతున్న వేళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

- Advertisement -

ఈ సందర్భంగా భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై మాట్లాడుతూ.. గల్వాన్ లోయ ఘర్షణలో మన వీర సైనికులు వెనక్కి తగ్గలేదని అన్నారు. 

అలాగే చైనా ద్వారా మన దేశానికి సంక్రమించిన కరోనా వైరస్‌పై విజయం సాధించే వరకు వెనక్వేకి తగ్గరాదని సూచించారు. 

దేనిని రాజకీయం చేయకూడదని వ్యాఖ్యానించిన అరవింద్ కేజ్రీవాల్.. ఈ రెండు యుద్ధాల్లోనూ మనందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 

రెండో స్థానంలో.. ఢిల్లీ

ఇక కరోనా విషయానికొస్తే.. దేశ రాజధాని నగరం ఢిల్లీ మొత్తం పాజిటివ్ కేసుల్లో తమిళనాడును దాటేసి రెండో స్థానానికి వచ్చేసింది. దాదాపు 60 వేల మార్కు సమీపంలో ఉంది. 

ఆదివారం ఒక్కరోజే 3 వేల పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 59,746కు చేరింది. 

ఇప్పటి వరకు 33 వేల మందికిపైగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం 25 వేలకుపైగా బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

‘‘కరోనా పరీక్షలు మూడింతలు పెంచాం..’’

ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్షలను మూడింతలు పెంచినట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. గతంలో రోజుకు 5 వేల పరీక్షలు చేస్తే.. ఇప్పుడు రోజుకు 18 వేల పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. 

కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు కోవిడ్ కేర్ సెంటర్లకు వెళ్లాలని సూచించారు. అనారోగ్య సమస్యలు లేనివారు, ఇళ్లల్లో వసతులు ఉన్నవారు హోం క్వారంటైన్‌లో ఉండొచ్చన్నారు.

హోం క్వారంటైన్‌లో ఉండేవారందరికీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తెలుసుకునే పల్స్ ఆక్సీమీటర్లు ప్రభుత్వమే అందజేస్తుందని, కరోనా నుంచి కోలుకున్న తరువాత వీటిని తిరిగి ఇచ్చేస్తే సరిపోతుందని కేజ్రీవాల్ తెలిపారు. 

- Advertisement -