నిజామాబాద్, ఏపీ రైతులకు చుక్కలు చూపిస్తున్న యూపీ ఇంటెలిజెన్స్

12:22 pm, Sun, 28 April 19

వారణాసి: ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేయాలని భావిస్తున్న నిజామాబాద్ పసుపు, ఎర్రజొన్న రైతులకు ఉత్తరప్రదేశ్ ఇంటెలిజెన్స్ చుక్కలు చూపిస్తోంది. మోదీ పోటీ చేస్తున్న వారణాసిలోనే పోటీ చేయాలని భావిస్తున్న తెలంగాణలోని నిజామాబాద్, నల్లగొండ జిల్లాలు, ఏపీలోని ప్రకాశం జిల్లా రైతులు ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న వీరికి స్థానిక పోలీసులు, అధికారుల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో యూపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు, అధికారులు తమను బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

తమకు మద్దతు ఇవ్వాలని, నామినీలుగా బలపరచాలని స్థానిక రైతులను కోరితే ఇంటెలిజెన్స్ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని తెలంగాణ రాష్ట్ర పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు ఆరోపించారు. నామినేషన్లు వేస్తే బాగుండదని హెచ్చరిస్తున్నారని అన్నారు. తమకు మద్దతు ఇచ్చిన తమిళనాడు రైతులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటల తర్వాత విడిచిపెట్టారని పేర్కొన్నారు.

పసుపు పంటకు గిట్టుబాటు ధర, పసుపు బోర్డు ఏర్పాటును పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 50 మంది రైతులు వారణాసి చేరుకున్నారు. శనివారం వీరు నామినేషన్లు వేయకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మరోవైపు తమిళనాడు రైతులు కూడా వారణాసిలో మోదీపై పోటీకి దిగుతున్నారు. వారణాసిలో రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది.