‘‘పాక్‌ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.. అందుకే భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రయిక్స్ చేయాల్సి వచ్చింది…’’

12:13 pm, Tue, 26 February 19
vijaygokule sensetional comments on today surjikal attack

gokul pressmeet informetions

న్యూఢిల్లీ: పుల్వామాలో భారత ఆర్మీ కాన్వాయ్ పై జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన తరువాత, పాకిస్థాన్ చర్యలు తీసుకుంటుందని ఆశించామని, కానీ, ఆ దేశం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతోనే లక్షిత దాడులు చేయాల్సి వచ్చిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్ పై ఆయన మీడియాతో మాట్లాడారు.

మరిన్ని ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న పక్కా సమాచారం తమకు అందిందని, అందువల్లే వారు తెగబడక ముందే మట్టుబెట్టాలన్న నిర్ణయానికి వచ్చామని ఆయన స్పష్టం చేశారు.

పక్కా సమాచారంతోనే దాడి…

బాలాకోట్ లోని జైషే మహమ్మద్ శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని, ఆ సంఖ్యపై తాను ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని అన్నారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు బస చేసివున్నారన్న స్పష్టమైన సమాచారం తెలుసుకున్న తరువాతనే సాధారణ ప్రజల ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకుని దాడి చేశామని విజయ్ గోఖలే తెలిపారు.

భారత్ పై తెగించిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులను నివారించేందుకే వైమానిక దాడులు చేయాల్సివచ్చిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం మద్దతు లేనిదే ఉగ్రవాద దాడులు జరగబోవని ప్రపంచం మొత్తానికీ తెలుసునని, ఐఎస్ఐ అండ చూసుకుని రెచ్చిపోయే ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పే తీరుతామని, అందులో భాగంగానే యుద్ధ విమానాలతో దాడులకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

ఈ దాడితో బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరం పూర్తిగా ధ్వంసమైందని ఇది మౌలానా మసూద్ అజర్ కు కోలుకోలేని దెబ్బేనని పేర్కొన్నారు. దాడిలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిక్షకులు, సీనియర్ కమాండర్లు మరణించారని తెలిపారు.