భయం గుప్పిట్లో ఉత్తర, వాయువ్య భారతం.. 20 రాష్ట్రాల్లో హై అలర్ట్!

- Advertisement -

న్యూఢిల్లీ: భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర భారతదేశాలకు ముప్పు పొంచి ఉన్నట్లు ఐఎండీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రచండగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలను కోరింది. రాజస్థాన్‌లో మరోసారి ఇసుక తుఫాన్‌ వచ్చే అవకాశాలున్నాయని చెప్పటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హెచ్చరికల నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి.

- Advertisement -

దక్షిణ భారతదేశంలో కూడా తుపాన్‌ ప్రభావం ఉంటుందని ఐఎండీ ఆ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, తెలుగురాష్ట్రాల్లో గంటకు 70 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీలో 2 నుంచి 7 సెం.మీల మేర వర్షం పడే అవకాశం ఉందని, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని ప్రకటనలో వివరించింది. గత వారం గాలిదుమారం వానలతో దేశవ్యాప్తంగా 124 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -