మోడీ ఆర్థిక విధానాలు దారుణం.. బ్యాంకులపై నమ్మకమే పోయింది: నిప్పులు చెరిగిన మన్మోహన్ సింగ్

- Advertisement -
బెంగళూరు: మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నఆర్థిక విధానాలు అత్యంత దారుణంగా ఉన్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిప్పులు చెరిగారు. రైతుల సమస్యలు, ఉద్యోగాల సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సమస్యలకు మోడీ విధానాలే  కారణమని ఆయన అన్నారు. అయితే దిద్దుబాటు చర్యలకు అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా బీజేపీ ప్రభుత్వం కుట్రపూరిత సిద్ధాంతాలను అమలు చేస్తోందని మన్మోహన్ తప్పుబట్టారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతుండటాన్ని కూడా మన్మోహన్ తీవ్రంగా విమర్శించారు. అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు ఆ ప్రయోజనాలు వినియోగదారులకు బదలాయించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
 ‘మన రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న యువకులకు ఉపాధి అవకాశాలు రావడం లేదు. ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. పెరిగిపోతున్న బ్యాంకింగ్ నేరాలు ఆ రంగం మీద ప్రజల నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. నిజానికి ఈ అన్ని విషయాల్లోనూ దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు..’ అని మన్మోహన్ విమర్శించారు.
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానం, నోట్ల రద్దు నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకున్న రెండు పెద్ద తప్పిదాలని మన్మోహన్ విమర్శించారు. హేతుబద్ధత లేని విధానాలు, వాటి అమలు తీరు ప్రజలను తీవ్ర ఇక్కట్ల పాలు చేశాయని ఆయన వ్యాఖ్యానించారు.
- Advertisement -