చెన్నై: ఒక్క వ్యక్తి ద్వారా 104 మందికి కరోనా సోకింది. ఈ ఘటన ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్‌లోని(ఎన్‌ఎస్‌బీ రోడ్) ఓ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే వ్యక్తికి జూన్ 22న కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.
దీంతో ఆ స్టోర్‌లో పని చేసే మిగతా 303 సిబ్బంది సహా వారి కుటుంబ సభ్యులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 104 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వీరిలో చాలావరకు తురైయూర్, తాలూకాల గ్రామాలకు చెందిన వారు.
ఫలితంగా కేవలం 13 రోజుల్లోనే ఆ రెండు గ్రామాల్లో కరోనా కేసులు 10 రెట్లు పెరిగాయి. జూన్ 22 వరకు 10 కరోనా కేసులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 108కి చేరింది.
వారిలో నలుగురు మినహా అందరూ ఆ జ్యువెలరీ దుకాణం సిబ్బందే కావడం గమనార్హం. మొదటి వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే మిగిలిన సిబ్బంది అందరినీ క్వారంటైన్‌కి పంపక పోవడమే మిగతా 103 మంది కొంప ముంచింది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ఎన్‌ఎస్‌బీ రోడ్‌లోని మిగతా దుకాణాలను కూడా రెండు వారాల పాటు మూసి వేయాలని ఆదేశించడంతో పాటు ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా ప్రకటించింది.