ముంబైలోని తాజ్ హోటళ్లకు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే నుంచి బెదిరింపు కాల్స్

- Advertisement -

ముంబై: పాకిస్థాన్‌, కరాచీలోని స్టాక్‌ఎక్స్‌చేంజ్‌పై సోమవారం జరిగిన ఉగ్రదాడి తర్వాత ముంబైలోని తాజ్ హోటళ్లకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా నుంచి ఈ కాల్స్ వచ్చాయి.

కొలాబాలోని తాజ్ మహల్ ప్యాలెస్, టవర్ హోటల్, బాంద్రా (వెస్ట్)లోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటళ్లకు ఫోన్ చేసిన వ్యక్తి తాను లష్కరే తాయిబా ఉగ్రవాదినని పేర్కొంటూ హోటళ్లను పేల్చేస్తానని బెదిరించాడు.

- Advertisement -

సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 గంటలకు హోటళ్లకు వేర్వేరుగా ఈ కాల్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్ వచ్చిన వెంటనే హోటళ్ల వద్ద భద్రతను ముమ్మరం చేసినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

క్విక్ రియాక్షన్ బృందాలు (క్యూఆర్‌టీఎస్), కౌంటర్ టెర్రరిజం యూనిట్లను రెండు హోటళ్ల వద్ద మోహరించినట్టు పేర్కొన్నారు. మొదటి కాల్ అర్ధరాత్రి 12:30 గంటలకు కొలాబా హోటల్‌కు వచ్చిందని, హోటల్‌ను పేల్చేస్తామని బెదిరించినట్టు పేర్కొన్నారు.

ఆ తర్వాత ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్ బాంద్రా హోటల్‌కు వచ్చింది. రెండు ఫోన్లు ఒకే నంబరు నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ముంబై సైబర్ సెల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

కరోనా వైరస్ కారణంగా రెండు హోటళ్లు మూసివేతలో ఉండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -