న్యూఢిల్లీ: 74వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రధానమంత్రి మోడీ ఎర్రకోట సాక్షిగా దేశంలోని పౌరులకు గుడ్న్యూస్ చెప్పారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఆయన ప్రసంగిస్తూ కరోనా యోధులకు ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్లు ప్రస్తుతం వివిధ టెస్టింగ్ దశల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అవి విడుదల అవుతాయని ఆయన పేర్కొన్నారు.
సాధ్యమైనంత తక్కువ సమయంలో వాటిని దేశంలోని పౌరులందరికీ చేరవేస్తామని, ఇందుకు సంబంధించిన ప్లాన్ కూడా తమ ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు.
దేశంలోని 130 కోట్ల భారతీయులకు ‘ఆత్మ నిర్భర్ భారత్’ అనేది ఒక మంత్రంగా మారిందన్నారు. దాని వల్లే మనం ఈరోజు పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు, ఇతర వైద్య సామగ్రి మన దేశంలోనే తయారు చేసుకోగలుగుతున్నామని తెలిపారు.
భారత దేశం ఎన్నో ఏళ్ల నుంచి ముడిసరుకులను ప్రపంచానికి ఎగుమతి చేస్తోందని, ఇప్పుడు ఫినిష్డ్ గూడ్స్ ఎగుమతి చేయాల్సిన సమయం ఆసన్నమైందని మోడీ చెప్పారు.
దేశం ఇక తనకు అవసరమైనవన్నీ స్వయంగా తయారు చేసుకోవడంతోపాటు.. ‘మేక్ ఇన్ ఇండియా’.. అనేది ‘మేక్ ఫర్ వరల్డ్’గా రూపాంతరం చెందాలని ప్రధాని పిలుపేనిచ్చారు.
ఇకమీదట ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని, లేకుంటే దేశీయ వస్తువులకు డిమాండ్ ఉండదని ఆయన పేర్కొన్నారు.
దేశీయ ఉత్పత్తుల తయారీదారులకు మనం ప్రోత్సాహం అందించాలంటే.. ‘వోకల్ ఫర్ లోకల్’ కావడం ఒక్కటే మార్గమని ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలిపారు.
చదవండి: 74వ స్వాతంత్ర్య దినోత్సవం: ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ…