సెషన్స్ జడ్జి కుటుంబంపై విష ప్రయోగం.. జడ్జి, ఆయన కుమారుడి మృత్యువాత

- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి మహేంద్ర త్రిపాఠీ కుటుంబంపై విషప్రయోగం జరిగింది.

విషం కలిపిన చపాతీలు తిన్న జడ్జి, ఆయన కుమారుడు మృతి చెందారు. చపాతీలు తినని ఆయన భార్య మాత్రం ప్రాణాలు నిలుపుకోగలిగారు.

ఈ ఘటనలో ఓ మహిళను ప్రధాన సూత్రధారిగా అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం మహేంద్ర త్రిపాఠీ, ఆయన కుమారుడు ఈ నెల 20న చపాతీలు తిన్న తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.

వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే రెండు రోజుల క్రితం వారిద్దరూ మృతి చెందారు.

విషం కలిపిన చపాతీలు తినడం వల్లే వారిద్దరూ మృతి చెందినట్టు నిర్ధారించిన పోలీసులు చింద్వారాలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలైన సంధ్యాసింగ్ అనే మహిళను అరెస్ట్ చేశారు.

కొంతకాలం క్రితం జడ్జి చింద్వారాలో పనిచేశారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన బేతుల్‌కు బదిలీ అయ్యారు. అక్కడ ఆయన కుటుంబంతో కలిసి ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో త్రిపాఠీని కలిసేందుకు సంధ్యాసింగ్ విశ్వప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. దీంతో వారి కుటుంబాన్ని అంతం చేయాలని పథకం పన్నింది.

త్రిపాఠీ అప్పటికే పలు సమస్యలతో బాధపడుతుండడంతో వాటి బారి నుంచి బయటపడేందుకు ప్రత్యేక పూజలు చేస్తానని, దీంతో సమస్యలన్నీ ఎగిరిపోతాయని నమ్మబలికింది.

ఇందుకోసం గోధుమపిండి తీసుకురావాలని కోరింది. తర్వాతి రోజు ఆయన గోధుమపిండి తీసుకెళ్లారు.

ఆ పిండిలో విషం కలిపిన సంధ్యాసింగ్ చపాతీలు తయారు చేసి ఇచ్చింది. వాటిని ఇంటికి తీసుకెళ్లిన త్రిపాఠీ కుమారుడితో కలిసి తిన్నారు. ఆ వెంటనే వారు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు.

త్రిపాఠీ భార్య మాత్రం ఆ చపాతీలు తినకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అస్వస్థతకు గురైన ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా, గోధుమపిండిని తానే తీసుకెళ్లినట్టు త్రిపాఠీ ఆయన కుమారుడికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంధ్యాసింగ్‌తోపాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని కూడా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.

- Advertisement -