అప్పుడు చెప్పలేదు కానీ.. ఇప్పుడు కొత్త డిమాండ్లు: అమిత్ షా

8:01 pm, Wed, 13 November 19

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిణామాలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అవుతారని ముందే చెప్పామని గుర్తు చేశారు.

అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, ఇపుడు మాత్రం కొత్త డిమాండ్లు తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. గవర్నర్‌ను కలిసేందుకు ఇప్పటికీ తమకు సంఖ్యాబలం ఉందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

తగిన సంఖ్యాబలం ఉన్న ఏ పార్టీ అయినా ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలవొచ్చని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు అంశంలో తొందరపడలేదని, 18 రోజులు వేచి చూశారని అమిత్‌షా అన్నారు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇచ్చిన సమయం గురించి షా మాట్లాడుతూ.. ఇంతకుముందు ఏ రాష్ట్రానికీ ఇంత సమయం కేటాయించలేదన్నారు. ఈసారి ఏకంగా 18 రోజుల సమయం ఇచ్చామని పేర్కొన్నారు. అసెంబ్లీ పదవీ కాలం ముగియడంతో గవర్నరే పార్టీలను ఆహ్వానించారని తెలిపారు.