సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు.. సీజేఐ కార్యాలయం ఇక ఆర్టీఐ పరిధిలోకి!

7:28 pm, Wed, 13 November 19

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ యాక్ట్) పరిధిలోకి తీసుకొస్తూ తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌వీ రమణ, డీవై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది.

సీజేఐ కార్యాలయం సమాచార హక్కుచట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

పారదర్శకతలేని వ్యవస్థను ఎవరూ కోరుకోరని, ఆ పేరుతో న్యాయవ్యవస్థ నాశనమవకూడదని విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు.

2010లో ఈ అంశంపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఏపీ షా(రిటైర్డ్), జస్టిస్‌లు విక్రమ్‌జిత్ సేన్, ఎస్.మురళీధర్‌తో కూడిన ముగ్గురు సభ్యుల ఢిల్లీ ధర్మాసనం.. సీజేఐ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని తన 88 పేజీల తీర్పులో పేర్కొంది.

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయాన్ని చేరిస్తే న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు విఘాతం కలగొచ్చన్న సుప్రీంకోర్టు పిటిషన్‌ను కూడా ఈ సందర్భంగా ఢిల్లీ ధర్మాసనం తోసిపుచ్చింది.

న్యాయవ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ చట్టం కిందకు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌కు ఢిల్లీ హైకోర్టు తీర్పు వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది.

సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ.. ఆర్టీఐ ఉద్యమకారుడు ఎస్‌సీ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది.

ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు తీర్పును వెలువరిస్తూ సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని తీర్పును వెల్లడించింది.