అయోధ్య కేసు: రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విచారణ జనవరికి వాయిదా…

supreme-court
- Advertisement -

supreme-court

న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసుపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.  దీంతో దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ కేసులో తుది తీర్పు మరింత ఆలస్యం కానుంది.

- Advertisement -

రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై విచారణకు జనవరి మొదటివారంలో తేదీలను వెల్లడిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని  పేర్కొంది.

జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎప్పుడైనా రోజువారీ విచారణ ప్రారంభం కావచ్చని, ధర్మాసనం ఏర్పాటు, రోజువారీ విచారణ షెడ్యూల్‌పై జనవరిలో నిర్ణయం తీసుకుంటామని  వెల్లడించారు.

చీఫ్ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ కె.ఎం జోసెఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఎంతో కీలకమైన ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏదో ఒకటి తేల్చుతుందని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ కేసును జనవరికి వాయిదా వేయడంతో రెండు నెలలు వేచిచూడక తప్పదు. వివాదాస్పద రామజన్మభూమి–బాబ్రీ మసీదు ప్రాంతంలోని 2.77 ఎకరాల భూమిని సమంగా విభజించి సున్నీ వక్ఫ్‌ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్‌లాలా సంస్థలకు కేటాయించాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ మొత్తం 13 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఈ కేసును విస్తృత‌ ధర్మసనానికి అప్పగించడానికి ఈ ఏడాది సెప్టెంబరులో నిరాకరించింది. తదుపరి విచారణ అక్టోబరు 29కు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం ప్రకటించింది. ఈనేపథ్యంలోనే తిరిగి 2019 జనవరికి వాయిదా వేసింది.

- Advertisement -