మళ్లీ ‘హమారా బజాజ్’.. చేతక్ ‘సెకండ్ ఇన్నింగ్స్’!

bajaj-auto-unveils-chetak-electric-scooter
- Advertisement -

చేతక్ బ్రాండ్ స్కూటర్.. గుర్తుందా? కోట్లాది మధ్యతరగతి ఇళ్లలో ఒకప్పుడు ఇదే ఉండేది. ఆ రోజుల్లో ప్రతి రోజూ.. ప్రతి ఇంట్లో.. ‘హమారా బజాజ్’ అనే స్లోగన్ కూడా రేడియో, టీవీలో వినిపిస్తూ ఉండేది. ఆ తరువాత అందరూ మోటార్‌ బైకుల మోజులో పడడంతో అమ్మకాలు తగ్గి క్రమంగా చేతక్ స్కూటర్ కనుమరుగైంది.

కానీ ఇప్పుడు ఇదే స్కూటర్ మళ్లీ ఎలక్ట్రిక్ అవతార్‌లో భారతీయ రోడ్లపై పరుగులుతీయనుంది. అవును, దేశంలో రెండో అతిపెద్ద మోటార్ సైకిల్ తయారీ సంస్థ బజాజ్ ఆటో.. స్కూటర్ సెగ్మెంట్‌లో చేతక్‌ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

10 ఏళ్ల తరువాత మళ్లీ మార్కెట్లోకి…

బజాజ్ ఆటో చేతక్ స్కూటర్ల తయారీని 2009లోనే ఆపివేసింది. మోటార్‌సైకిళ్లకు ఉన్న గిరాకీని గుర్తించి, వాటి తయారీలో పడి.. చేతక్‌పై నిర్లక్ష్యం వహించింది. అయితే ఒకప్పుడు చేతక్ బ్రాండ్‌కి ఉన్న ఆదరణ.. ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది.

దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తరువాత.. ఈ ఐకానిక్ స్కూటర్ బ్రాండ్‌ను మళ్లీ ఈ-స్కూటర్‌గా రోడ్లపై పరుగులు పెట్టించాలని బజాజ్ ఆటో భావిస్తోంది.

వచ్చే జనవరి నుంచే…

వచ్చే జనవరి నుంచి పుణే, ఆ తరువాత బెంగళూరులో చేతక్ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను ప్రారంభించనున్నట్లు బజాజ్ ఆటో ప్రకటించింది. కంపెనీకి చెందిన చకన్ ప్లాంట్ నుంచే ఈ స్కూటర్‌ను తీసుకురానున్నారు. వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన మేరకు చేతక్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందని పేర్కొంది.

అలాగే ఇతర ప్రాంతాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరించనున్నామని, వచ్చే ఏడాది నుంచి ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను యూరప్‌లోని పలు మార్కెట్లకు కూడా ఎగుమతి చేయాలని భావిస్తున్నామని బజాజ్ ఆటో పేర్కొంది.

రెండు వేరియంట్లలో చేతక్ ఎలక్ట్రిక్…

తాజాగా నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, బజాజ్ ఆటో ఎెండీ రాజీవ్ బజాజ్‌ పర్యవేక్షణలో.. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించారు. కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఒకటి- 85 కిలోమీటర్ల రేంజిలో, రెండోది- 95 కిలోమీటర్ల రేంజిలో ఉంటాయి. అంటే.. ఐదు గంటలపాటు ఛార్జింగ్ పెడితే ఈ స్కూటర్లు అన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.

చేతక్ ఎలక్ట్రిక్ ధర ఎంతంటే…

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత అన్నది మాత్రం బజాజ్ ఆటో ఇంకా వెల్లడించలేదు. అయితే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఈ-స్కూటర్ ధర రూ.లక్షన్నర మించి మాత్రం ఉండబోదు. దేశంలోని బజాజ్ డీలర్ల ద్వారానే దీని అమ్మకాలు జరగనున్నాయి.

ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడంపై బజాజ్ ఆటో ప్రతినిధులు స్పందిస్తూ.. మార్కెట్‌లో అందరి కంటే ముందు ఉండడమే తమకు ముఖ్యమని, త్రీవీలర్స్, సూపర్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలోనూ మెరుగైన స్థానంలో ఉండటం కోసమే తమ ప్రయత్నమని తెలిపారు.

- Advertisement -