ఇక పెంపుడు కుక్కలకూ లైసెన్స్.. ప్రతి దానికీ జీపీఎస్, లేదంటే జరిమానా!

- Advertisement -
బెంగళూరు: ఇకమీదట పెంపుడు కుక్కలకు కూడా లైసెన్స్ తీసుకోవాల్సిందే.  లేని పక్షంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవును మీరు చదివింది నిజమే. ఈ కొత్త నిబంధనను బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అమలులోకి తీసుకొచ్చింది. బీబీఎంపీ పరిధిలో భద్రత కోసం పెంచుకునే పెంపుడు కుక్కల కోసం లైసెన్సు తప్పనిసరి. ఇం దుకు సంబంధించి బీబీఎంపీ ప్రతిపాదనకు జూన్‌ నెలనుంచి నిబంధన అమలులోకి రానుందని బీబీఎంపీ జాయింట్‌ డైరెక్టర్‌ డా.జి.ఆనంద్‌ వెల్లడించారు.
పైగా పెంపుడు కుక్కలకు  అనుమతి పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు,  పెంపుడు కుక్కలను గుర్తించడానికి వీలుగా..  లైసెన్సు ఇచ్చే సందర్భంలో వాటికి జీపీఎస్‌ ఆధారిత కాలర్‌ ఐడి కూడా ఇస్తారు.  దీంతో ఈ  పెంపుడు కుక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులకు ఇట్టే తెలిసిపోతుంది.  కుక్క పేరు, వయసు, జాతి, యజమాని పేరు, వివరాలు, వ్యాక్సినేషన్‌ తదితర సమాచారం ఈ జీపీఎస్ కాలర్ ఐడీ ద్వారా బీబీఎంపీ రికార్డులలో నమోదు చేయనున్నారు. ఇక ఈ లైసెన్స్ కాలపరిమితి ఏడాది మాత్రమే.  అంటే..  ప్రతి సంవత్సరం లైసెన్సు రెన్యూవల్‌ చేయించుకోవాల్సిందే.
లైసెన్సు తీసుకోవడానికి సంబంధించి బీబీఎంపీ పంపిన ప్రతిపాదనను సవరించిన ప్రభుత్వం ఒక్కో పెంపుడు కుక్కకు రూ.110గా లైసెన్సు ఫీజు నిర్ణయించింది. ఒకవేళ లైసెన్సు లేకుండా కుక్కలను పెంచితే అందుకు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  తాజా నిబంధనల మేరకు సొంత ఇల్లు ఉంటే అందులో 3 పెంపుడు కుక్కలను పెంచుకునే అవకాశం ఉం టుంది. అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లలో నివసించేవారు అయితే ఒకటి, సంతానాభివృద్ధి కోసం పెంచుకునేవారైతే 10 కుక్కల వరకు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు.
ఇప్పటి వరకు ఇలా పెంపుడు కుక్కలకు లైసెన్స్ అనే నిబంధన తప్పనిసరి కాకపోయినా 2017లో 405 పెంపుడు కుక్కలకు లైసెన్సు మంజూరు చేశామని,  100 కుక్కలకు రెన్యువల్‌ చేసినట్లు బీబీఎంపీ జాయింట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ వెల్లడించారు.  బీబీఎంపీ పరిధిలోని 198 వార్డుల్లో 2017 అక్టోబరు వరకు లైసెన్సు ఫీజుల రూపంలో రూ. 56,210 ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు.
వీధి కుక్కల ఆగడాలు పెచ్చు మీరిన సందర్భంలో వాటిని పట్టుకునే క్రమంలో నగరపాలిక సిబ్బంది ఒకవేళ పెంపుడు కుక్కలను పట్టుకుంటే గనుక వాటి యజమానులు వాటి లైసెన్సులు చూపాల్సి ఉంటుందన్నారు. ఈ మధ్యకాలంలో పెంపుడుకుక్కల చోరీలు, తప్పిపోవడం అధికమవుతున్న నేపథ్యంలో ఈ లైసెన్సు, జీపీఎస్‌ కాలర్‌ ఐడీ విధానాన్ని ప్రవేశపెట్టామని, దీంతో వాటి ఆచూకీ తెలుసుకోవడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు.
- Advertisement -