బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 15 ఏళ్ల నాటి వాహనాలు నిషేధం

1:09 pm, Tue, 5 November 19

పట్నా: బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వాడుకలో ఉన్న 15 ఏళ్ల నాటి వాహనాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నిషేధం కేవలం ప్రభుత్వ వాహనాలకు మాత్రమే. పట్నా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పాత వాహనాల కారణంగా కాలుష్యం పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచే ఇది అమల్లోకి రానుంది.

ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని చీఫ్ సెక్రటరీ దీపక్ కుమార్ తెలిపారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 ఏళ్ల క్రితం పాత వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించనున్నట్టు ఆయన నిన్ననే ప్రకటించారు.

దేశంలో దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం తారస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరించారు. ప్రస్తుతం వాహనాల విషయంలో సరి బేసి విధానం వాడుతున్నట్లే తామూ ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తెస్తున్నట్లు దీపక్ కుమార్ పేర్కొన్నారు.