ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమగా పేరొందిన బాలీవుడ్. ఇప్పుడు వరుస విషాదాలతో సతమతమవుతోంది.
ఎంఎస్ ధోని చిత్రంలో హీరోగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్(34) నేడు ఆత్మహత్య చేసుకున్నారు.
ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధృవీకరించారు.
సుశాంత్ మరణవార్త బాలీవుడ్ మొత్తాన్నీ షాక్కు గురిచేసింది. అయితే ఇటీవల ఆయన మేనేజర్ దిషా సాలియన్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ సంఘటన జరిగి వారం కూడు కాకముందే సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
2013లో కాయ్ పోచే చిత్రంతో సుశాంత్ బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తరువాత ఎన్నో సినిమాలు, టీవీ షోలతో ప్రజలను ఎంతగానో అలరించారు.
పీకే, డిటెక్టివ్ బ్యోంకేష్ భక్షి, ఎంఎస్ ధోని, చిచ్చోరే వంటి చిత్రాలతో హిందీ సినీ పరిశ్రమలో తనకో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
గొప్ప నటుడిగా ఎన్నో అవార్డులను తన సొంతం చేసుకున్నారు. సినిమాలతో యువతలో తన అభిమానులను పెంచుకోవడమే కాకుండా, పవిత్ర రిష్తా అనే టీవీ సీరియల్తో ప్రతి కుటుంబానికీ దగ్గరయ్యారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్లతో పాటు మరి కొందరు ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు.
ప్రతిభావంతుడైన ఓ యువ నటుడిని బాలీవుడ్ కోల్పోయిందని ప్రధాని ట్వీట్ చేశారు. సచిన్ టెండూల్కర్ కూడా తన ట్విటర్లో ‘సుశాంత్ ఆత్మహత్య విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా.
అతడు ఎంతో ప్రతిభ గల నటుడు. అతడు మరణించడం బాధ కలిగిస్తోంది. అతడి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని రాసుకొచ్చారు.
సచిన్ మాత్రమే కాకుండా యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, ఇర్ఫాన్ పఠాన్, పాక్ కీపర్ కమ్రాన్ అక్మల్ తదితర క్రికెటర్లు సుశాంత్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గణ్, అనుపమ్ ఖేర్, సంజయ్ దత్, రిచాచద్దా, ఏక్తా కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా సుశాంత్ మృతిపై ట్విటర్ ద్వారా నివాళులర్పించారు.
అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, సృతీ ఇరానీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే వంటి రాజకీయ నేతలు కూడా సుశాంత్ మృతికి సంతాపం తెలిపారు.
అతడి కుటుంబసభ్యులు, అభిమానులు ధైర్యంగా ఉండాలని కోరారు.
