ఎస్సీ, ఎస్టీ చట్టంపై.. కేంద్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం!

pm-modi
- Advertisement -
pm-modiన్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చట్టంలో ఎటువంటి మార్పులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ, ఇతర దళిత సంఘాలు చేస్తున్న డిమాండ్లతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ‘ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ బిల్లు’ను ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం.
ఎఫ్‌ఆర్డీఐ బిల్లునూ ఉపసంహరించుకున్న కేంద్రం..
వివాదాదస్పద ఫైనాన్సియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్‌ఆర్డీఐ) బిల్లును ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చైర్మన్‌కు సమాచారం అందజేసింది. మంగళవారం లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతా రాయ్ మాట్లాడుతూ ఎఫ్‌ఆర్డీఐ బిల్లును ఉపసంహరిస్తున్నట్లు జేపీసీ చైర్మన్‌కు ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ లేఖ రాశారని చెప్పారు. ఎఫ్‌ఆర్డీఐ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవడం విపక్షాల విజయం అని సౌగతారాయ్ అభివర్ణించారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై…
ఇక పౌరసత్వ సవరణ బిల్లుపై అధ్యయనానికి జేపీసీకి లోక్‌సభ మరికొంత సమయం మంజూరు చేసింది. దీని ప్రకారం శీతాకాల పార్లమెంట్ సమావేశాల చివరి వారం మొదటి రోజున జేపీసీ నివేదికను సభకు సమర్పించాల్సి ఉంటుంది. 1955 పౌరసత్వం చట్టానికి సవరణ ప్రతిపాదిస్తూ కేంద్రం 2016లో బిల్లును ప్రవేశపెట్టింది.
- Advertisement -