న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకపోగా రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధించేందుకే దేశంలోని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి.
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు, నగరాల్లో మళ్లీ లాక్డౌన్ చర్యలు చేపట్టేందుకే కేంద్రం కూడా మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
ఇకపై ప్రతి ఆదివారం లాక్డౌన్ విధించబోతున్నట్లు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. జూలై 5 నుంచి ఆ రాష్ట్రంలో లాక్డౌన్ అమలులోకి రానుంది.
అంతేకాదు, సోమవారం నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం కూడా సెలవు ప్రకటించారు.
ఇక తమిళనాడు విషయానికొస్తే.. ఇప్పటికే చెన్నైలో ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్లోనూ కరోనా వ్యాప్తి కట్టడి కోసం జూలై 31 వరకు లాక్డౌన్ విధించారు.
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూడా లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 తరువాత కూడా రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయని ఆదివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.
దేశంలోని ఇతర మెట్రో సిటీలకు ఏమాత్రం తీసిపోని హైదరాబాద్ నగరంలోనూ కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. దీంతో హైదరాబాద్ నగరంలోనూ 15 రోజులపాటు లాక్డౌన్ విధించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.