వచ్చే నెల చివరికల్లా ఢిల్లీలో ఐదున్నర లక్షల కేసులు

- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో రెండు నెలల్లో కరోనా కేసులు భారీగా పెరగబోతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా.

ఢిల్లీలో కరోనా పరిస్థితిపై లెఫ్టెనెంట్ గవర్నర్‌ అనిల్ బైజాల్ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంత్ర జైన్ హాజరయ్యారు.

- Advertisement -

సమావేశం ముగిసిన తరువాత సిసోడియా మీడియాతో మాట్లాడారు. దాదాపు మరో 50 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు 51/2లక్షలు దాటే అవకాశం ఉందని హెచ్చరించారు.

జులై 31 నాటికి ఢిల్లీలో కరోనా కేసులు ఈ మార్కు దాటే అవకాశం ఉందని సిసోడియా చెప్పారు.

జూన్ 30 నాటికి ఢిల్లీలో కరోనా బాధితుల కోసం కనీసం 15 వేల బెడ్లు అవసరమని, అదే జూలై 31 నాటికి 80 వేల బెడ్ల వరకు కావలసి వస్తుందని హెచ్చరించారు.

అయితే ఢిల్లీలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని సిసోడియా స్పష్టం చేశారు.

అయితే సిసోడియాకంటే ముందుగా మీడియా సమావేశంలో పాల్గొన్న సత్యేంత్ర జైన్ మాత్రం ఢిల్లీలో కరోనా సామాజిక వ్యాప్తి ఉందని చెప్పారు.

కరోనా ఎవరి నుంచి ఎలా ఎప్పుడు సోకిందో తెలియని కేసులు సగానికి పైగా నమోదౌతున్నాయన్నారు. 

మరోవైపు ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఢిల్లీలో కరోనా పరిస్థితిపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 

ఢిల్లీలో ప్రస్తుతం 27, 654 కేసులు నమోదయ్యాయి. 10, 664 మంది కోలుకున్నారు. 761 మంది చనిపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వేలమంది కరోనా బారిన పడే ప్రమాదముందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -