చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.
బుధవారం కొత్తగా 2,174 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,193కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 48 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. ఫలితంగా మృతుల సంఖ్య 576కి చేరుకుంది.
కొత్తగా నమోదైన కేసుల్లో 2,094 మంది స్థానికులు కాగా , 80 మంది విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చినవారని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
అలాగే బుధవారం ఒక్కరోజే కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 842 మంది డిశ్చార్జ్ అయినట్టు పేర్కొంది. ఇక వివిధ ఆస్పత్రుల నుంచి ఇప్పటివరకు 27,624 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 21,990 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.