దేశంలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో 64,553 కేసులు.. 1007 మరణాలు!

10:19 pm, Fri, 14 August 20
corona in india 64553 positive cases in just 24 hours

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఆగస్టు మొదలైనప్పట్నించి రోజూ 60 వేలకుపైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

గడిచిన 24 గంటల్లోనూ కొత్తగా 64,553 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,61,190కి చేరింది.

మరోవైపు దేశంలో నమోదు అవుతోన్న మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగానే ఉంది. తాజాగా ఒక్కరోజులో 1007 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. 

దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 48,040కి చేరింది. మరణాల విషయంలో మన దేశం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. 

ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతోన్న కరోనా కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తరువాత భారత్ మూడో స్థానంలో కొనసాగుతుండగా రోజువారీ కేసుల్లో మాత్రం ప్రథమ స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం.

కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారు 17,51,555 కాగా ప్రస్తుతం 6,61,595 మంది ఇంకా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.