ఉత్తరప్రదేశ్‌లో ఆగని కరోనా కేసులు.. వంద దాటిన వైనం!

4:13 pm, Tue, 31 March 20

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం నాటికి ఈ సంఖ్య 100 దాటింది.

బరేలీలో నేడు ఐదుగురికి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. వీరితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 101కు చేరుకుంది.

ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి భార్య, అతడి తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఉన్నట్టు బరేలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినీత్ శుక్లా తెలిపారు.

నోయిడాలో పనిచేస్తున్న ఆ వ్యక్తికి ఇది వరకే కరోనా సోకిందని పేర్కొన్నారు. నోయిడాలోని ఆ వ్యక్తి పనిచేస్తున్న కంపెనీలోని 31 మందికి కరోనా సోకినట్టు తేలిందని, మరో ఆరు కేసులు మీరట్‌లో నమోదైనట్టు డాక్టర్ వినీత్ తెలిపారు.

రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదైన నోయిడాను నిన్న(సోమవారం) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు.

జిల్లాల పరంగా చూస్తూ గౌతమ్‌బుద్ధ నగర్‌లో 38, మీరట్‌లో 19, ఆగ్రాలో 11, లక్నోలో 9, ఘజియాబాద్‌లో 7, బరేలీలో 6, ఫిలిబిత్, వారణాసిలో చెరో రెండు, లఖిమ్‌పూర్-ఖిరి, కాన్పూర్‌నగర్, మోరాదాబాద్, షామ్లి, జాన్‌పూర్, బాఘ్‌పట్, బులంద్‌షహర్‌లలో ఒక్కో కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు.