భారత్‌లో కరోనా: ఇప్పటి వరకు 29 మంది మృతి, పాజిటివ్ కేసులు 1071…

12:57 pm, Mon, 30 March 20
corona-virus-in-india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1071కి చేరుకుంది. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 29 మంది మరణించారని, ఇంకో 942 మంది బాధితులు వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

చదవండి: ఒకే రోజు ఆరుగురి మృతి .. దేశంలో 25కు చేరిన కరోనా మరణాలు

తెలంగాణలో ఇప్పటివరకు 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 21కి చేరినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

 అన్నిటికంటే మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. తాజాగా ఈ రాష్ట్రంలో మృతుల సంఖ్య 8కి చేరింది. రాష్ట్రం మొత్తంమీద 218 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చికిత్స పొంది వీరిలో 25 మంది వరకు కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. 

చదవండి: ప్రజలెవరూ బయటకు రావొద్దు: గుజరాత్ సీఎం

ఇక కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 213కు చేరుకకుంది. కరోనా కారణంగా ఈ రాష్ట్రంలోనూ ఒకరు మరణించారు. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు 85కు చేరగా.. ఇక్కడ ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు.

ఇక గుజరాత్‌లో కరోనా మృతుల సంఖ్య 5కు చేరింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లలో ఇద్దరు చొప్పున మరణించారు. 

బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా ఒకరు చొప్పున మృతి చెందినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి. 

కఠిన చర్యలతో ఇబ్బందే.. క్షమించండి: ప్రధాని మోడీ

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ఆదివారం ప్రసంగిస్తూ.. కరోనా మహమ్మారిని జయించేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని, తాము తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలిగి ఉంటే తమను క్షమించాలని అభ్యర్థించారు. 

అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడం మినహా వేరే మార్గం లేదని, ప్రజలందరూ అర్థం చేసుకుని ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వాలకు సహకరించాలని ఆయన కోరారు.

చదవండి: సినీ కార్మికులను ఆదుకునేందుకు.. సీసీసీని ఏర్పాటు చేసిన చిరంజీవి