కరోనా అప్‌డేట్: దేశంలో 258కి పెరిగిన పాజిటివ్ కేసులు, ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే…

1 week ago
covid-19-positive-cases-reaches-to-258-in-india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. శనివారం(మార్చి 21) నాటికి దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 258కి చేరుకుంది. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో అత్యధికులు విదేశాల నుంచి వస్తున్న వారే. కరోనా బాధితుల సంఖ్యలో దేశంలోని మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో కేరళ ఉంది.

చదవండి: వదంతులు నమ్మొద్దు.. కరోనా అలా రాదు: హెల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్

విదేశీ ప్రయాణికుల్లో అత్యధికులు తొలుత ముంబై విమానాశ్రయంలో దిగుతుండడంతో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య దేశంలోనే అధికంగా ఉంది. అలాగే గల్ఫ్ నుంచి వచ్చే వారిలో అత్యధికులు కేరళకు చెందిన వారు. దీంతో మహారాష్ట్ర తరువాత కేరళలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 

దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య ఇలా…

మహారాష్ట్రలో         –    52 మంది
కేరళలో              –    40 మంది
ఢిల్లీలో               –    26 మంది
ఉత్తరప్రదేశ్‌లో        –    24 మంది
తెలంగాణలో         –    19 మంది
హర్యానాలో          –    17 మంది
రాజస్థాన్‌లో          –    17 మంది
కర్ణాటకలో            –    15 మంది
లడక్‌లో              –    13 మంది 
గుజరాత్‌లో           –     7 (ఏడుగురు)
జమ్మూ కాశ్మీర్‌లో    –    4 (నలుగురు)
తమిళనాడులో       –    3 (ముగ్గురు)
ఉత్తరాఖండ్‌లో        –    3 (ముగ్గురు)
ఒడిశాలో             –    2 (ఇద్దరు)
పంజాబ్‌లో            –    2 (ఇద్దరు)
పశ్చిమ బెంగాల్‌లో   –    3 (ముగ్గురు)
ఆంధ్రప్రదేశ్‌లో         –    3 (ముగ్గురు)
పుద్దేచ్చేరిలో          –    1 (ఒక్కరు)

చదవండి:  ‘కరోనా’ ఎఫెక్ట్: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. స్కూల్స్, మాల్స్, సినిమా హాల్స్ క్లోజ్!

కరోనా వైరస్ ఇప్పటికే దేశంలోని 22 రాష్ట్రాలకు పాకింది. తాజాగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా పాజిటివ్ అని తేలిన వారిలో 39 మంది విదేశీయులు కాగా, మిగిలిన వారు భారతీయులు.

ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ ఇప్పటి వరకు ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.  ఇక ఈ ప్రాణాంతక వైరస్ బారి పడి చికిత్స పొంది 23 మంది కోలుకోగా మిగిలిన బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

రేపు ‘జనతా కర్ఫ్యూ’: ప్రధాని మోడీ పిలుపు…

దేశంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీని కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. అవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దంటూ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 

అంతేకాదు, ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రజలంతా స్వచ్ఛందంగా ‘జనతా కర్ప్యూ’ పాటించాలని కూడా ఆయన సూచించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ తమ సంకల్ప బలాన్ని చాటాలని ఆయన కోరారు. 

మరోవైపు రైల్వేశాఖ శనివారం ఆర్థరాత్రి నుంచి 3500 రైళ్లను కూడా రద్దు చేస్తోంది. బాలీవుడ్‌లో షూటింగులను కూడా  ఈ నెల 31వ తేదీ వరకు నిలిపివేశారు.

కరోనా పాజిటివ్‌ అని తేలిన వారు గతంలో ఎవరెవరిని కలిశారో, వారికి కూడా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సూచించింది.